NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారత రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావి డా.బి.ఆర్. అంబేద్కర్

1 min read

సమాజంలో కుల వివక్షను పారద్రోలేందుకు కృషి ,

అంబేద్కర్  జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయం

డా:బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి దిక్సూచి వంటి భారత రాజ్యాంగాన్ని రచించిన డా. బి. ఆర్. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో మంగళవారం డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి కలెక్టర్ వెట్రిసెల్వి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  సమాజంలో అంటరానితనం, కుల వివక్షలపై రాజీలేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి  భారతరత్న డా. అంబేద్కర్ అని, ఆయన  ఆశయాలకు అనుగుణంగా ఆయన  చూపిన బాటలో నేటి యువత పయనించాలన్నారు. పేదరిక నిర్మూలన, సామజికాభివృద్ధి విద్య ద్వారానే  సాధ్యమని నమ్మిన వ్యక్తి డా.బి.ఆర్ అంబేద్కర్ అని ,విద్య విలువను ప్రతీ ఒక్కరికీ  తెలియజేసి, విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. న్యాయ కోవిదుడుగా, రాజకీయవేత్తగా, సామాజికవేత్తగా, సంఘ సంస్కర్తగా ఆయన చేసిన సేవలు అమోఘమన్నారు. అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టి, అనేక అవమానాలు, వివక్షను ఎదుర్కొంటూ అత్యున్నత స్థాయికి చేరిన  బాబా సాహెబ్ అంబేద్కర్  జీవితం తరతరాలకూ స్ఫూర్తిదాయకమన్నారు.  సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ఉద్యమకారుడని,సామాజిక, ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు, సంస్కరణలు రూపొందించడంతో పాటు సర్వమానవ సమానత్వానికి కృషిచేసిన కారణజన్ముడు అంబేద్కర్ అని చెప్పారు.    ఆయన  ఆశయాల సాధనకు మనమందరం కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు.కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు,వివిధ షెడ్యూల్డ్ కులాల సంఘాల నాయకులు, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *