ఎకో టూరిజం అభివృద్ధికి సీఎస్ఆర్ నిధుల వినియోగం
1 min read

అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో అటవీ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లా ఎస్పీ సునీల్ షెరాణ్, ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ అనురాగ్ మీనా, ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావు, డీఎఫ్ఓ నాగమునీశ్వరి, డిఆర్ఓ రామునాయక్, సర్వే ఏడీ శ్రీరామ్ మోహన్, డీఎంజీవో వేణుగోపాల్, దేవాదాయ శాఖ అధికారి మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను వినియోగించుకోవాలన్నారు. దీనివల్ల పర్యాటకుల రాక పెరిగి, వారికి ఆహ్లాదకర వాతావరణం కల్పించవచ్చని తెలిపారు. ఈ దిశగా తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అటవీ శాఖ అధికారులకు ఆదేశించారు. కృష్ణనందిలో నిర్వహించిన జాయింట్ ఇన్స్పెక్షన్ అనంతరం కొంత ప్రాంతాన్ని అటవీ భూమిగా గుర్తించినట్లు పేర్కొంటూ, అక్కడ ఉన్న విద్యుత్ కనెక్షన్లను తొలగించి సరిహద్దులను స్పష్టంగా గుర్తించాలని సూచించారు. బ్యాంబూ ప్రాజెక్ట్ అమలుకు హార్టికల్చర్ శాఖతో సమన్వయం చేసుకుని అవసరమైన సహకారం పొందాలని తెలిపారు. బనగానపల్లె మండలం గులాంఅలీబాద్లో ఫారెస్ట్ యాక్ట్ సెక్షన్ 16 కింద డీకేటీ రద్దు మరియు ఆక్రమణలపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.పచ్చర్ల ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి ఇబ్బంది లేకపోయినా, గ్రామ పంచాయతీ చెత్త పారవేత సమస్యపై జిల్లా పంచాయతీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సర్వనరసింహ స్వామి దేవాలయం అభివృద్ధికి అవసరమైన పాత గెజిట్ ప్రతులను సమర్పించాలని దేవాదాయ శాఖ అధికారిని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో అటవీ భూముల వివరాలపై ముగ్గురు డీఎఫ్ఓలు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆత్మకూరు పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్‌గా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే శ్రీశైలం దేవస్థానం నుంచి రావాల్సిన నిధులను త్వరితగతిన మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ చెక్‌పోస్టులను పోలీస్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేసి భద్రతను మెరుగుపరచాలని, లోతైన అటవీ ప్రాంతాలకు వెళ్లే సందర్భాల్లో సమాచారం పంచుకునే వ్యవస్థను బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లా ఎస్పీ సునీల్ షెరాణ్ మాట్లాడుతూ, శ్రీశైలం ముఖద్వారం నుంచి సాక్షి గణపతి ఆలయం వరకు అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో రహదారులను వెడల్పు చేయడం, సాక్షి గణపతి ఆలయం వద్ద పార్కింగ్ సౌకర్యాలను విస్తరించడంపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

