పరామర్శ పేరుతో రాజకీయ బల ప్రదర్శనా?
1 min read
నిందితులను పరామర్శించడమేమిటి…?
మాజీ సీఎం జగన్ పర్యటనపై గుడిసె ఆది కృష్ణమ్మ ధ్వజం
కర్నూలు, న్యూస్ నేడు : జైలులో ఉన్న నిందితులను పరామర్శించడానికి రాజకీయ బల ప్రదర్శన నిర్వహించడం అవసరమా అని టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన పై ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.మాజీ సీ ఎం వై.ఎస్. జగన్‌రెడ్డి కర్నూలుకు వచ్చిన తీరు చూస్తుంటే పరామర్శకు వచ్చారా? లేక బలప్రదర్శనకు వచ్చారా? అని కర్నూలు ప్రజలు ముక్కున వేలేసుకుని మాట్లాడుకుంటున్నారని అన్నారు. విరుపాక్షిని నిజంగా పరామర్శించడానికే జగన్‌రెడ్డి వచ్చి ఉంటే ఇంత భారీ బలప్రదర్శన అవసరం ఏముందని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ముందుగానే తన పార్టీ నాయకులకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి, గొడవలకు దారితీసేలా చేసి, తాను పరామర్శ పేరుతో వచ్చి బలప్రదర్శన చేయాలనే ప్రణాళికతో వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు.గత కొన్ని రోజులుగా పరామర్శల పేరుతో బలప్రదర్శనలు నిర్వహిస్తూ, ప్రజల్లో తనకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదని చూపించుకునేందుకు జగన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆలూరులో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వాస్తవాలను ప్రజలకు వివరించకుండా జగన్‌రెడ్డి ఏకపక్షంగా మాట్లాడటం సరికాదన్నారు. నిన్న జైలు వద్ద పార్టీ కార్యకర్తలతో జగన్‌రెడ్డి మాట్లాడిన మాటల్లో వాస్తవాల కంటే రాజకీయ ఆరోపణలే ఎక్కువగా ఉన్నాయని అన్నారు.ఎమ్మెల్యే దళిత మహిళ ఇంటికి వెళ్లి ఎస్సీ మహిళపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు స్పష్టంగా ఉన్నాయని, ఆ సమయంలో పోలీసులు ఎమ్మెల్యేను అడ్డుకుంటున్న దృశ్యాలు కూడా అందులో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. బోయ సామాజికవర్గానికి చెందిన మండల కన్వీనర్ వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనపై కూడా వాస్తవాలు మాట్లాడకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదన్నారు.“జగన్‌రెడ్డి .. ఇకపై పర్యటనలకు వచ్చినప్పుడు ముందుగా స్థానికంగా పూర్తి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడండి. పరామర్శ పేరుతో రాజకీయ బలప్రదర్శనలు చేయడం మానుకోండి” అని ఆది కృష్ణమ్మ సూచించారు.


