15 రోజుల్లోపు నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి
1 min read
పర్యాటక అభివృద్ధికి వినూత్న ప్రణాళికలు రూపొందించాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ప్రత్యేకతలను గుర్తించి, వాటి ఆధారంగా సమగ్ర అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలను 15 రోజుల్లోపు రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నియోజకవర్గ ప్రత్యేక అధికారులను ఆదేశించారుబుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక విభాగాలపై సంబంధిత నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా ప్రాంతాల బలాలు, అభివృద్ధి అవకాశాలను గుర్తించి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి మండలంలోని సహజ వనరులు, చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేలా స్పష్టమైన ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అదే విధంగా మంత్రాలయానికి వచ్చే భక్తులను సమీప పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ఆకర్షించే కార్యాచరణతో పాటు, జిల్లాలోని జలపాతాలు, చారిత్రక ప్రాంతాలను వ్యూ పాయింట్లు, బోటింగ్ వంటి సదుపాయాలతో అభివృద్ధి చేయాలన్నారు. పశుసంవర్ధక రంగంలో రుణాల మంజూరును వేగవంతం చేసేందుకు బ్యాంకర్లతో సమన్వయం చేసి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ నియోజకవర్గ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. పంటల నష్టాన్ని తగ్గించి మెరుగైన దిగుబడులు సాధించేందుకు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) విధానాన్ని విస్తృతంగా అమలు చేయాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ రూఫ్టాప్ల ఏర్పాటును ప్రోత్సహించి, అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సిపిఓ భారతి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనురాధ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, తదితరులు పాల్గొన్నారు.


