మంత్రి నారా లోకేష్ కృషి వల్లే ఏపీకి ఆర్సిలర్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ.. రాష్ట్ర మంత్రి
1 min read
రూ.1,47,162 కోట్ల ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో లక్ష మందికి ఉద్యోగావకాశాలు
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కృషి వలనే రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలంలో.. పేరుగాంచిన ఆర్సిలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్ పరిశ్రమ రాబోతుందన్నారు. రూ.1,47,162 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో (1వ దశలో రూ.61,780 కోట్లు, 2వ దశలో రూ.85,382 కోట్లు) ఈ పరిశ్రమ ఏర్పాటవుతుందని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. 17.8 ఎంటిపిఏ సామర్థ్యంతో 2 దశలలో (మొదటి దశలో 7.3 ఎంటిపిఏ & 2వ దశలో 10.5 ఎంటిపిఏ) ఏకీకృత ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తారన్నారు.అప్పట్లో ఒడిశాలో పరిశ్రమ పెట్టాలన్న ఆలోచన వారికి ఉండిందన్నారు. 2018లో దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి నారా లోకేష్.. ఆదిత్య మిట్టల్‌ను కలిసి పరిశ్రమను ఏపీలో పెట్టాలన్న దానిపై చర్చించినట్లు మంత్రి టి.జి భరత్ చెప్పారు. అయితే 2019లో ప్రభుత్వం మారడంతో ఏపీలో పరిశ్రమ పెట్టాలని ప్రభుత్వం కోరినా అది జరగలేదన్నారు. తీరా మళ్లీ ఇప్పుడు తమ ప్రభుత్వం రావడంతో ఒకే ఒక్క జూమ్ కాల్‌లో లోకేష్.. ఆదిత్య మిట్టల్‌తో మాట్లాడి ఏపీలో పరిశ్రమను పెట్టేలా ఒప్పించారని మంత్రి టి.జి భరత్ తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఎన్డీయే ప్రభుత్వం ఉందన్న నమ్మకంతోనే పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందన్నారు. దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమగా ఇది నిలిచిపోతుందన్నారు. ఇటీవల జరిగిన దావోస్ సదస్సులో కూడా ఏపీని బాగా ప్రమోట్ చేశామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించినట్లు మంత్రి తెలిపారు.