NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం, గుర్తింపు: మంత్రి టీజీ భరత్

1 min read

పుట్టపర్తి, న్యూస్​ నేడు:  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకు గతంలో ఎన్నడూ లేనంతగా గౌరవం, గుర్తింపు లభిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉంటారని, మంత్రి నారా లోకేశ్  కూడా ఆర్యవైశ్యుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. ఆర్యవైశ్యుల గౌరవానికి ప్రతీకగా పెనుగొండ పేరును ‘వాసవి పెనుగొండ’గా మార్చడం, అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం కోసం స్థలం కేటాయించడం జరిగిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొనడం కూడా ఆర్యవైశ్యుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయాల్లోకి రావాలని,  ముందుగా ప్రజాక్షేత్రంలో వచ్చి ప్రజలకు సేవ చేయాలని మంత్రి టీజీ భరత్ సూచించారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆర్యవైశ్యులకు ఎప్పటికీ అండగా నిలిచారని, ఆయన చూపిన మార్గంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలో మరింతగా ఎదగాలని, వారి అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి ఆర్యవైశ్యుడు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సభ్యుల్లో ఆర్యవైశ్యుల నుంచి ఒకరికి అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేశ్ ని తాను కోరినట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇక పుట్టపర్తి భవిష్యత్‌లో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందబోతోందని మంత్రి అన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్యవైశ్య సంఘం జిల్లా కమిటీ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఆర్యవైశ్యులకు న్యాయం చేసేలా, సంఘం అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య, పొలిటికల్ కమిటీ చైర్మన్ కోట సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసవి సేవాదళ్ అధ్యక్షుడు దూపకుంట్ల శబరీ వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *