ధార్మిక చైతన్య దీపనంతో సమాజంలో ధర్మజ్యోతి వెలగాలి
1 min read
పూజ్య ధర్మాచార్యుల పిలుపు
ఘనంగా హిందూ ధార్మిక సమ్మేళనం
అత్యంత భక్తిశ్రద్ధలతో చండీ హోమం.
కర్నూలు , న్యూస్ నేడు: ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక చైతన్యం, సనాతన ధర్మ విలువలను ప్రజల్లో పెంపొందించాలనే సంకల్పంతో డోన్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం నందు “ధార్మిక చైతన్య దీపనం” పేరుతో హిందూ ధార్మిక సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా వారణాశి పట్టణానికి చెందిన సుప్రసిద్ధ పండితులు, యాజ్ఞికులు డాక్టర్ సోమయాజులు నేతృత్వంలో శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధి నందు నూతనంగా నిర్మించిన యాగశాల ప్రారంభోత్సవం, మహా చండీయాగం నిర్వహించారు. రఘునాధ శాస్త్రి ఆలయ అర్చకులు శ్రీమాన్ పెరంబోదూర్ శ్రీకాంత్ స్వామి అత్యంత వైభవంగా యాగశాల చతుర్ ద్వార పూజ మరియు మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం ధార్మిక చైతన్య దీపనం పేరుతో ధార్మిక సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అఖిలాంధ్ర సాధుపరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ ఆచార్య పరమాత్మ నందగిరి స్వామీజీ ఆశీః ప్రసంగంతో ప్రారంభమైనది. తోట్లపల్లి అచలానంద ఆశ్రమం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విరజానందస్వామీజీ కీలకోపన్యాసం చేశారు. హైందవ సంస్కృతి నవ్య జీవనక్రాంతి అని, హైందవ సంస్కృతిని సంరక్షించుకున్నప్పుడే దేశమనుగడ సాధ్యమవుతుందని, సంస్కృతిని మరిచిపోతే దేశ సంరక్షణ ప్రశ్నార్ధకమవుతుందని హెచ్చరించారు. వారణాసి వాస్తవ్యులు డాక్టర్ సోమయాజులు మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకై చేయవలసిన కృషిని గుర్తు చేస్తూ, కులభేదాలను విస్మరించి భారతీయులంతా ఒక్కటిగా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మానికి గ్లాని ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో గీతలో కృష్ణ పరమాత్మ బోధించిన విధంగా కర్తవ్య దీక్షను పూనవలసిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. రాష్ట్ర యువ విభాగ సాధుసంతు అధ్యక్షులు శ్రీమాన్ నిత్యతృప్త దాస్ స్వామీజీ దేశంలో జరిగుతున్న పరిణామాలు తెలుసుకొని యువత జాగరూకతతో ప్రవర్తించవలెనని పిలుపునిచ్చారు. ఇస్కాన్ ధర్మ ప్రచారకులు శ్రీ రఘునందన్ సేవక్ దాస్ జీ మాట్లాడుతూ గురువు, సాధువు, శాస్త్రం ఈ మూడింటి ప్రాశస్త్యాన్ని విశ్లేషించారు. కలియుగంలో భవసాగరాన్ని దాటించే తారక మంత్రం భగవన్నామమేనని, దాన్ని బలంగా పట్టుకోవాలని సూచించారు. విశ్వహిందూ పరిషత్తు రాష్ట్ర కార్యాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సమాజ వ్యవస్థను పటిష్ఠపరచడంలో స్త్రీశక్తి చాలా కీలకమైనదని, ధర్మరక్షణకు ప్రతి స్త్రీ మూర్తి కంకణ బద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి, గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజుగుప్తా, శ్రీ బాల ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మేపల్లి శ్రీనివాసరావు, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్టీ ముక్కా అశ్వినికీర్తి స్త్రీశక్తి జాగరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డోన్ నగరంలోని అన్ని ధార్మిక సంస్థలతోపాటు, నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ధార్మిక సంస్థల ప్రతినిధులు విశేష సంఖ్యలో హాజరై, పూర్ణాహుతిని కళ్లారా దర్శించుకొని, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి హాజరైన అతిధులకు సాధుసంతులందరినీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పాతాళం సుబ్బారావు రజినీ, శ్రీనివాసులు దంపతులు, అందరినీ ఘనంగా సన్మానించి సత్కరించారు. పాతాళం సుబ్బారావు చేస్తున్న ధార్మిక సేవలను వక్తలు వేనోళ్ల కొనియాడారు. ఈ ధార్మిక సమ్మేళన కార్యక్రమానికి సమన్వయకర్తగా ప్రముఖ ధార్మిక ప్రవచకులు, కవయిత్రి, తెలుగు పండితులు డాక్టర్ కర్నాటి చంద్రమౌళిని వ్యవహరించారు.



