ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ పరీక్షలో విజయం సాధించిన బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు
1 min read
ప్రజా సేవతో పాటు న్యాయ పోరాటాలకు మరింత బలం చేకూరుస్తా – ఎల్లార్తి అర్జున్ వాల్మీకి
హోళగుంద న్యూస్ నేడు: ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ (AIBE)లో బీసీవై పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ వాల్మీకి ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ రాజకీయ, సామాజిక, ప్రజా సంఘాల నాయకులు, స్నేహితులు, అభిమానులు, న్యాయవాదులు మరియు గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎల్లార్తి అర్జున్ వాల్మీకి విలేకరులతో మాట్లాడుతూ, రాజకీయ జీవితంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూ, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అండగా నిలవడం తన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా వాల్మీకి–బోయ సమాజాన్ని షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) జాబితాలో చేర్చే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు.ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని కేవలం రాజకీయంగా మాత్రమే కాకుండా చట్టపరంగానూ ఎదుర్కొనే సంకల్పంతో న్యాయవాదిగా మారాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందాలంటే న్యాయవ్యవస్థ అత్యంత బలమైన సాధనమని విశ్వసించి, ఆ దిశగా కృషి చేసి ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టమని అన్నారు.ఒక చిన్న మారుమూల ప్రాంతమైన ఎల్లార్తి గ్రామంలోని సాధారణ పేద కుటుంబంలో జన్మించి, ఎన్నో కష్టాలను అధిగమిస్తూ ప్రజా ఉద్యమాలు, రాజకీయ బాధ్యతలు, సామాజిక సేవలను సమన్వయం చేసుకుంటూనే ఈ విజయాన్ని సాధించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ విజయం తన కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు.భవిష్యత్తులో రాజకీయాలతో పాటు న్యాయపరమైన పోరాటాల ద్వారా కూడా ప్రజల హక్కులను కాపాడేందుకు మరింత కృషి చేస్తానని, అన్యాయానికి గురైన ప్రతి పేదవాడికి చట్టబద్ధంగా అండగా నిలుస్తానని ఎల్లార్తి అర్జున్ వాల్మీకి స్పష్టం చేశారు.



