NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, ఈ-క్రాప్ నమోదు పై రైతులకు అవగాహన

1 min read

మార్లమడికి రైతు సేవా కేంద్రంలో “పొలం పిలుస్తోంది” కార్యక్రమం

హొళగుందన్యూస్ నేడు: హొళగుంద మండలంలోని మార్లమడికి రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కే) పరిధిలో మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్ ఆధ్వర్యంలో బుధవారం “పొలం పిలుస్తోంది” కార్యక్రమం నిర్వహించారు. రైతులకు వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన సాగు విధానాలు, పంటల సంరక్షణ, ఈ-క్రాప్ నమోదు, మిశ్రమ పంటల సాగుపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో గత నెల రోజులుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) విధానాన్ని అనుసరించాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలతో సహా 36 రకాల విత్తనాలను జీవామృతంతో శుద్ధి చేసి మట్టి, బూడిదతో కలిపి పొలాల్లో చల్లాలని తెలిపారు. వర్షాలు కురిసిన వెంటనే ఈ విత్తనాలు మొలకెత్తి ప్రధాన పంటకు రక్షణగా నిలవడంతో పాటు భూసారాన్ని పెంచి నేలలో తేమను ఎక్కువకాలం నిల్వ ఉంచుతాయని వివరించారు.ఖరీఫ్–2026లో పంటలు సాగు చేసిన రైతులు, పంటల బీమా నమోదు చేసుకున్న రైతులు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి ఈ-క్రాప్ బుకింగ్ నమోదు చేయించుకోవాలని సూచించారు.ఎల్‌నినో ప్రభావంతో పత్తి సహా పలు పంటలు ఎండుదశకు చేరుకున్నాయని, పత్తి పంటను రక్షించేందుకు పొటాషియం నైట్రేట్ లేదా 19-19-19 ఎరువును లీటరు నీటికి 5 గ్రాములు లేదా నానో యూరియాను లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. దీంతో మొక్కలు సుమారు 10 రోజుల పాటు తేమలేమిని తట్టుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.వర్షాధార, మెట్ట ప్రాంతాల్లో రైతులు మిశ్రమ పంటలు, అంతర పంటలు, రక్షణ పంటల సాగు చేపట్టడం ద్వారా అదనపు ఆదాయం పొందడంతో పాటు పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. పత్తిలో కందిని అంతర పంటగా, జొన్నను రక్షణ పంటగా సాగు చేయడం, వేరుశనగతో పాటు కందిని లైన్లలో విత్తడం వంటి పద్ధతులు రైతులకు ప్రయోజనకరమని చెప్పారు. ఒక పంట దెబ్బతిన్నా మరో పంట ద్వారా ఆదాయం లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి విరూపాక్షి, రైతు సేవా కేంద్రం సిబ్బంది లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *