పారిశుద్ధ్య సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణీ
1 min read
ప్రజల ఆరోగ్యం కోసం పారిశుద్ధ్య సిబ్బంది సేవలు ఎంతో కీలకం: మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు: నగరంలోని టీజీ వెంకటేష్ మైనారిటీ షాదీఖానాలో 10, 11, 12 వార్డులకు చెందిన పారిశుద్ధ్య సిబ్బందికి టీడీపీ నాయకుడు మెహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో సేఫ్టీ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొని పారిశుద్ధ్య సిబ్బందికి సేఫ్టీ కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, నగర పరిశుభ్రత కోసం పారిశుద్ధ్య సిబ్బంది రాత్రి, పగలు తేడా లేకుండా అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని అన్నారు. వారి సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలు నగరంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. తమ ఫ్యాక్టరీ నుంచి హైపోను ఉచితంగా అందిస్తున్నామని, నగరంలోని నీటి వనరుల్లో గుర్రపుడెక్క తొలగింపు కార్యక్రమాలను కూడా చేపడుతున్నామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని మంత్రి తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మెహబూబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. సమాజానికి మంచి చేసే వ్యక్తులకు ప్రజలు ఎప్పుడూ మద్దతుగా నిలవాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, తదితరులు పాల్గొన్నారు.



