కరువు సహాయక చర్యలు చేపట్టాలి…
1 min read
పంట నష్టపరిహారం ఎకరాకు 50 వేల రూపాయలు ఇవ్వాలి… పి. రామచంద్రయ్య
పత్తి పంటను పరిశీలిస్తున్న సిపిఐ, ఏపీ రైతు సంఘం నాయకులు
న్యూస్ నేడు, పత్తికొండ: కరువు సహాయక చర్యలు చేపట్టి, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి. రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ, ఏపీ రైతు సంఘం ప్రతినిధి బృందం పత్తికొండ మండలంలోఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్ ని నో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. మే, జూన్ నెలల్లో అరకొర కురిసిన వర్షాలకు రైతులు వేరుశనగ, పత్తి, కంది, టమోటా, ఉల్లి, మిరప, సజ్జ తదితర పంటలను సాగు చేశారని, ఖరీఫ్ సీజన్ పూర్తికావస్తున్నా సరైన వర్షాలు కురవకపోవడంతో సాగు చేసిన పంటలు మొలక దశలోనే ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. జిల్లా అధికారులు ఎండిపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. పంట పెట్టుబడికి రైతులు బ్యాంకులలో తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు 6 నెలల పాటు కరువు పెన్షన్ 20వేల రూపాయలు ఇవ్వాలని, పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి జిల్లావ్యాప్తంగా ఎండిపోయిన పంటలను పరిశీలించి ఈనెల 3వ తేదీన అన్ని మండల కేంద్రాలలో తహసిల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.


