NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాలువల్లో చెత్త వేస్తే.. రహదారులు జలమయం

1 min read

వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం 

డ్రైనేజీ కాలువలు నిండి దోమల ఉత్పత్తికి ఆవాసం 

వ్యర్థాలను వాగులో వేసిన ఫంక్షన్ హాల్‌కు జరిమానా 

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు 

కర్నూలు, న్యూస్​ నేడు: శనివారం   నగర ప్రజలు డ్రైనేజీ కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, గృహ వ్యర్థాలు వంటి చెత్తను వేయడం వల్ల వర్షపు నీటి పారుదల వ్యవస్థ దెబ్బతింటోందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. డ్రైనేజీ కాలువలకు వ్యర్థాలు అడ్డుపడి అవి మూసుకుపోవడంతో వర్షం కురిసిన సమయంలో నీరు సక్రమంగా ప్రవహించక రహదారులపైకి చేరి జలమయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగడంతో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. శనివారం ఉదయం కురిసిన వర్షంలో సుమారు నాలుగున్నర గంటల పాటు కమిషనర్ స్వయంగా నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలను పరిశీలిస్తూ వ్యర్థాల తొలగింపు పనులను పర్యవేక్షించారు.ఓల్డ్ కల్లూరు వక్కెర వాగు పక్కన డైమండ్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు వ్యర్థాలను వాగులో వేస్తుండటాన్ని గమనించిన కమిషనర్, ఫంక్షన్ హాల్‌కు రూ.10,000 జరిమానా విధించాలని ఆదేశించారు. అలాగే ఆ ఫంక్షన్ హాల్‌ను బల్క్ వేస్ట్ జనరేటర్ జాబితాలో చేర్చి నిబంధనల ప్రకారం వ్యర్థాల నిర్వహణ చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. డ్రైనేజీ కాలువల్లో చెత్త పేరుకుపోవడం వల్ల కేవలం వర్షపు నీటి పారుదలకు మాత్రమే అంతరాయం కలగడం కాదని, నిల్వ నీరు దోమల ఉత్పత్తికి అనుకూల వాతావరణంగా మారి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల వ్యాప్తికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిల్వ నీరు, మూసుకుపోయిన కాలువలు దోమల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయన్నారు. అంతేకాకుండా ప్రధాన కాలువల వద్ద నీటి ప్రవాహం నిలిచిపోవడం వల్ల రహదారులు జలమయమై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు.అలాగే కాలువల్లో చెత్త పేరుకుపోవడం వల్ల దుర్వాసనలు వెదజల్లడంతో పాటు పారిశుద్ధ్య సమస్యలు, పర్యావరణ కాలుష్యం పెరుగుతాయని, భారీ వర్షాల సమయంలో నీరు ఇళ్లలోకి చేరి ప్రజల ఆస్తులకు నష్టం కలిగించే పరిస్థితులు సైతం ఏర్పడవచ్చని తెలిపారు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.ప్రతి పౌరుడు తమ ఇంట్లో ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు, గృహ చెత్తను డ్రైనేజీ కాలువలు, వాగులు, ఖాళీ స్థలాల్లో వేయకుండా నగరపాలక సంస్థ చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందజేయాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, కాలువలు, వాగులు, ప్రజా ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఈ జనార్ధన్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు మునిస్వామి, అనిల్, కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author