NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్టాఫ్ నర్సులకు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక అవగాహన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు  ఆధ్వర్యంలో స్టాఫ్ నర్సులకు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బయోమెడికల్ వ్యర్థాల వర్గీకరణ మరియు వాటి సక్రమ నిర్వహణపై అధికారులు వివరించారు. పసుపు రంగు డబ్బాలో శరీర అవశేషాలు, రక్తంతో కలుషితమైన వ్యర్థాలు, ఎరుపు రంగు డబ్బాలో ప్లాస్టిక్ బయోమెడికల్ వ్యర్థాలు, తెలుపు రంగు డబ్బాలో సూదులు మరియు ఇతర పదునైన వస్తువులు, నీలం రంగు డబ్బాలో గాజు వ్యర్థాలను వేయాలని సూచించారు. అలాగే తెలుపు రంగు షార్ప్స్ కంటైనర్‌లో ఒక శాతం హైపోక్లోరైట్ ద్రావణం తప్పనిసరిగా ఉండేలా చూడాలని తెలిపారు.కాగా, ఇదివరకే శానిటేషన్ సిబ్బందికి బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, తాజాగా స్టాఫ్ నర్సులకు కూడా ప్రత్యేక శిక్షణ అందించారు.విధులు నిర్వహించే సమయంలో ముఖం, ముక్కు, కళ్లను చేతులతో తాకరాదని, చేతులను శుభ్రంగా కడుక్కునే వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.బయోమెడికల్ వ్యర్థాల సక్రమ నిర్వహణ ద్వారా సంక్రమణ వ్యాధులను నివారించవచ్చని, వ్యక్తిగత భద్రతా పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని, ఆసుపత్రి పరిశుభ్రత పరిరక్షణలో ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీ.ఎస్‌.ఆర్‌.ఎం.ఓ డాక్టర్ పి. పద్మజ, డిప్యూటీ సీ.ఎస్‌.ఆర్‌.ఎం.ఓ డాక్టర్ వి. పద్మజ, అడ్మినిస్ట్రేషన్ అధికారి డాక్టర్ ఎం.వి. కిరణ్ కుమార్, గ్రేడ్-2 నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి గౌరి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్స్ టి. సంపత్, స్టాఫ్ నర్సులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author