ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న వక్కపొడి..!
1 min read

* 60 ఏళ్ల మహిళకు అప్పటినుంచి జ్వరం, దగ్గు
* శ్వాస అందక ఇన్నాళ్లుగా ఇబ్బంది
* కిమ్స్ సవీరాలో అధునాతన చికిత్సతో ఊరట
అనంతపురం, అక్టోబర్ 8, 2025: ఒక మహిళ ఆరు నెలలుగా విపరీతమైన దగ్గు, తరచు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా ఏదో ఇన్ఫెక్షన్ ఉందని మందులు ఇస్తూ వచ్చారు. అయినా తగ్గకపోవడంతో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి వచ్చారు. అక్కడ ఆమెకు చికిత్స చేసి ఊరట కల్పించిన కన్సల్టెంట్ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ యశోవర్ధన్ మంగిశెట్టి ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. “60 ఏళ్ల వయసున్న ఆ మహిళకు పరీక్షలు చేయగా.. ఆమె శ్వాసనాళం లోపలి భాగంలో ఏదో ఒక పదార్థం ఇరుక్కుని ఉన్నట్లు తెలిసింది. గతంలో వేరే ఆస్పత్రిలోనూ దాన్ని తీసే ప్రయత్నం జరిగినా, అది విఫలమైంది. దాంతో ఇక్కడ ఆమెకు మరింత అత్యాధునిక పద్ధతిలో ప్రయత్నించి లోపల ఇరుక్కున్న పదార్థాన్ని తొలగించాలని నిర్ణయించాం. రిజిడ్ బ్రాంకోస్కొపీ, రిజిడ్ ఫోర్సెప్స్ ఉపయోగించి ఆ పదార్థాన్ని విజయవంతంగా తొలగించగలిగాం. ఈ చికిత్స చేసిన తర్వాత ఆ మహిళ శ్వాసనాళాన్ని పూర్తిగా పునరుద్ధరించగలిగాం. దాంతో ఆమెకు వెంటనే దగ్గు, జ్వరం తగ్గాయి. ఊపిరి కూడా సులభంగా పీల్చుకోగలుగుతున్నారు. చాలాసార్లు సాధారణంగా కనిపించే దగ్గు, జ్వరం, శ్వాస ఇబ్బందుల వెనుక ఇలాంటి వేరే పదార్థాలు ఉండొచ్చు. సమయానికి సరైన పరీక్షలు, సరైన నైపుణ్యం ఉన్న వైద్యులు చికిత్స చేస్తే జీవితాలను రక్షించవచ్చు” అని డాక్టర్ యశోవర్ధన్ తెలిపారు.

