విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి – సిపిఐ
1 min read
ఎన్టీఏను రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్
హోళగుందలో నిరసనకు వెళ్తున్న సిపిఐ నాయకుల అరెస్టు ఖండన
హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలో భారత్ బంద్ సందర్భంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను బంద్ చేయాలని కోరుతూ శాంతియుతంగా వెళ్తున్న సిపిఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించిన ఘటనను సిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. అనంతరం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి పెద్దహ్యాట మారెప్ప మాట్లాడుతూ, ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, 22 మంది విద్యార్థుల బలిదానాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)ను రద్దు చేసి పారదర్శకమైన పరీక్షల వ్యవస్థను తీసుకురావాలని కోరారు.గత పదేళ్లలో వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీలు చోటుచేసుకోవడం వల్ల దేశ విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆయన విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.అలాగే సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు సిపిఐ పోరాటం కొనసాగుతుందని మారెప్ప స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కృష్ణయ్య, వెంకన్న, అసేన్, భాష, ఇనాయత్, సలాం సబ్, అబ్దుల్లా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆమాన్, పర్సప్ప, వీరప్ప, రంగన్న, మరిమల్ల, ఎల్లప్ప, రాము, మస్తాన్వలి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


