NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాయలసీమ డిక్లరేషన్ అమలుకై కృషి చేయాలి

1 min read

-మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

కర్నూలు, న్యూస్​ నేడు:  భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాయలసీమ డిక్లరేషన్ ను అమలు చేసినందుకు ప్రతి బిజెపి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షునిగా సునీల్ రెడ్డి ప్రమాణస్వీకారం స్థానిక బిఎఎస్ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమ వెనుకబాటు తనాన్ని తొలగించి సర్వత్ర అభివృద్ధి చేసేందుకు బిజెపి ఆధ్వర్యంలో డిక్లరేషన్ చేశామన్నారు. దానిని అమలుపరిస్తే రాయలసీమలో త్రాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండడంతోపాటు, ఎన్నో పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి వారందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తాను మంత్రిగా ఉన్నప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ ను తయారు చేయించామని, కానీ అప్పటి తెలంగాణకు చెందిన వారు అడ్డుకోవడంతో అది ముందుకు సాగలేదన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని ప్రాజెక్టు పూర్తిచేస్తే మరింత సాగునీరు లభ్యమవుతుందన్నారు. రాయలసీమకు హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి రాయలసీమకు అభివృద్ధికి అవసరమైన డిమాండ్లను ముందర పెట్టడం జరిగిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడే అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండదు అన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలకు 50 కోట్ల రూపాయల వరకు నిధులు అందించెదని ఇప్పుడు అవి రావటం లేదని వాటి సాధనకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కృషి చేయాలని టీజీ వెంకటేష్ కోరారు. పార్టీలో ప్రస్తుతం యువత ఎక్కువగా ఉందని వీరంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్, బిజెపి రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రమౌళి, పురుషోత్తం రెడ్డి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author