“లైంగిక నేరాల రక్షణలో విద్యార్థుల పాత్ర “పై వ్యాసరచన పోటీలు
1 min read
జిల్లా ఎస్పీ ఆదేశాలతో పాఠశాలలు, విద్యా సంస్థలలో వ్యాసరచన పోటీలు , అవగాహన సదస్సులు.
పోలీసు సంస్మరణ వారోత్సవాలలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన పోలీసులు
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఈరోజు వివిధ పాఠశాలలలో వ్యాసరచన పోటీలు , అవగాహన సదస్సులు నిర్వహించారు. అమరవీరుల వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధులలోని పలు విద్యా సంస్థలలో, పాఠశాలలో “లైంగిక నేరాల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అంతేకాకుండా సమాజ శ్రేయస్సు, భద్రతల కోసం పోలీసులు అందిస్తున్న సేవలు, త్యాగాలను వివరించారు.పోలీసులు అహర్నిశలు శ్రమిస్తూ సంఘ విద్రోహ శక్తులతో పోరాడే క్రమంలో ప్రాణాలు త్యాగం చేస్తుండటం జరుగుతోందన్నారు. పోలీసుల సేవలు, దైనందిన విధులు, త్యాగాలు పట్ల అవగాహన చేసుకోవడం, గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.జిల్లాలోని వివిధ కళాశాలలు, పాఠశాలల నుండి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. విద్యార్దులలో ఉన్న ప్రతిభను వెలికితీయటం, పోలీసు శాఖ పట్ల పూర్తి స్ధాయిలో అవగాహన కల్పించడం మరియు పోలీస్ శాఖ పట్ల మంచి దృక్పథం, స్ఫూర్తి కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేయనున్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలని త్యాగం చేసి అమరులైన పోలీసుల యొక్క త్యాగాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అమరవీరుల త్యాగ నిరతిని ఎన్నడూ మరువలేము అని కొనియాడుతూ వారికి శ్రద్ధాంజలి ఘటించి జోహార్లు పలికారు.

