ప్రకృతి వ్యవసాయంతో రైతుల ఆర్థికాభివృద్ధి
1 min read
రైతులు రెండు,మూడు రకాల పంటలు సాగు చేయాలి
- జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: ప్రకృతి వ్యవసాయం తో రైతుల ఆర్థికాభివృద్ధి, ప్రజారోగ్య రక్షణ, పర్యావరణ పరిరక్షణ కలుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఏ క్యాంప్ లో ఉన్న ఉద్యానవన భవనంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ట్రైనీ ఇంటర్నల్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు 5 రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం అంటే తనకు చాలా ఇష్టమని తను కూడా పదవీ విరమణ పొందిన అనంతరం వ్యవసాయం చేస్తానని కలెక్టర్ తెలిపారు.. వైజాగ్ లో తాను జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో సహజ వ్యవసాయం ఎక్కువగా అరకు, పాడేరు ప్రాంతాలలో బాగా ప్రోత్సహించడం జరిగిందన్నారు.. సహజ వ్యవసాయం ద్వారా పండించిన పంట ఉత్పత్తులు చాలా కాలం నాణ్యతతో ఉంటాయన్నారు.. అంతే కాకుండా సహజ వ్యవసాయం ద్వారా ఆదాయం ఖచ్చితంగా వస్తుందన్నారు… ప్రజలందరూ ఆహారం కొరకు రైతుల మీద ఆధారపడి ఉంటారని, రైతులు పంటను పండించడానికి భూమి మీద ప్రకృతి మీద ఆధారపడి ఉంటారన్నారు… అటువంటి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉందన్నారు..పురుగుమందులు, ఎరువులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల భూమి దెబ్బ తింటుందన్నారు.. రసాయన ఆధారిత వ్యవసాయ పద్ధతుల వలన నేల సారవంతం తగ్గిపోతుందని, సహజ వ్యవసాయం ద్వారా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తోపాటు రైతులు తక్కువ వ్యయంతో అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు..ఇక్కడ హాజరైన వారు కచ్చితంగా వారి గ్రామాలలో ఉండే రైతులతో సహజ వ్యవసాయం చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు…
మూడు రకాల పంటలు సాగు చేయండి..
రైతులు ఒకటే పంట రకం వేయకుండా 2, 3 రకాల పంటలు సాగు చేయాలని కలెక్టర్ రైతులకు సూచించారు… ఒకటే పంట రకం సాగు చేసి దాని మీద ఆధారపడడం వల్ల నష్ట పోయే అవకాశం ఉంటుందన్నారు… అంతే కాకుండా పాడి పశువులను పెంచుకొని ఆదాయం మరింత పెంచుకోవాలన్నారు.. పాడి పశువుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం రుణాల అవకాశం కూడా కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఇంచార్జి ఉద్యాన శాఖ అధికారి మదన్ మోహన్ గౌడ్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సాలు రెడ్డి, ఏపీసిఎన్ఎఫ్ డిపిఎమ్ మాధురి తదితరులు పాల్గొన్నారు.


