రాయలసీమలోనే తొలిసారిగా అరుదైన సర్జరీతో కిడ్నీ మార్పిడి
1 min read
– మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలులో విజయవంతం
కర్నూలు, న్యూస్ నేడు: మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలులో ఐదవ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ అరుదైన మరియు క్లిష్టమైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను 2026 జనవరి 25న నిర్వహించగా, పేషెంట్ 2026 ఫిబ్రవరి 2న పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.కిడ్నీ మార్పిడి పొందిన వ్యక్తి ఎస్. రవీంద్ర (48 సంవత్సరాలు), అల్లూరు గ్రామం, నందికొట్కూరు మండలం, కర్నూలు జిల్లా వాసి. ఆయన గత నాలుగేళ్లుగా కిడ్నీ వైఫల్యంతో బాధపడుతూ హీమోడయాలిసిస్ చికిత్స పొందుతున్నారు. పుట్టుకతోనే మూత్రనాళ సమస్య ఉండటంతో మూత్రం సక్రమంగా మూత్రాశయానికి చేరకుండా తిరిగి కిడ్నీలకు వెళ్లే సమస్య (రిఫ్లక్స్) ఏర్పడి, రెండు కిడ్నీలు క్రమంగా చిన్నవిగా మారి పనితీరు కోల్పోయాయి.ఈ పరిస్థితిలో ఆయన భార్య కే. పద్మావతి (40 సంవత్సరాలు), తన భర్తకు కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. వైద్య పరీక్షల్లో ఆమె కిడ్నీలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను చేపట్టారు.పేషెంట్‌కు మొత్తం మూడు ప్రధాన శస్త్రచికిత్సలు నిర్వహించారు. మొదటిగా BNI ఆపరేషన్ (లేజర్ చికిత్స) చేశారు. రెండవ దశలో పూర్తిగా దెబ్బతిన్న కుడి కిడ్నీని ల్యాపరాస్కోపీ ద్వారా తొలగించారు. ఈ శస్త్రచికిత్సను రెట్రోపెరిటోనియల్ నెఫ్రెక్టమీ అనే అత్యంత అరుదైన పద్ధతిలో నిర్వహించడం విశేషం. రాయలసీమ ప్రాంతంలో ఈ విధానంలో జరిగిన తొలి శస్త్రచికిత్స ఇదే కావడం గమనార్హం. మూడవ దశలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మొత్తం చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ – ఆరోగ్యశ్రీ పథకం కింద నిర్వహించారు.డా. అబ్దుల్ సమద్ (సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ & మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, లేజర్ యూరాలజీ స్పెషలిస్ట్) మాట్లాడుతూ, “పుట్టుకతో ఉన్న మూత్రనాళ సమస్యల వల్ల కిడ్నీలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ కేసులో అరుదైన రెట్రోపెరిటోనియల్ నెఫ్రెక్టమీ విధానంతో దెబ్బతిన్న కిడ్నీని తొలగించి, అనంతరం కిడ్నీ మార్పిడి చేయడం ఎంతో సవాలుతో కూడుకున్నది. అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆధునిక సాంకేతికత వల్ల ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేయగలిగాం” అని తెలిపారు. డా. సిద్ధార్థ్ హెరూర్ (కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్) మాట్లాడుతూ,“నాలుగేళ్లుగా డయాలిసిస్ మీద ఉన్న రోగికి కిడ్నీ మార్పిడి చేయడం వల్ల జీవిత నాణ్యత పూర్తిగా మారుతుంది. సరైన సమయంలో మార్పిడి చేయడం ద్వారా పేషెంట్ సాధారణ జీవితానికి తిరిగి చేరుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ పథకాల సహకారంతో ఇలాంటి అధునాతన చికిత్సలు అందించడం ఎంతో ఆనందంగా ఉంది” అని అన్నారు.మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ, “మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలులో అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో క్లిష్టమైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆరోగ్య పథకాల సహకారంతో రాయలసీమ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే మా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు.ప్రస్తుతం పేషెంట్ మరియు కిడ్నీ దాత ఇద్దరూ ఆరోగ్యంగా ఉండి, వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.

