కూటమి ప్రభుత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అత్యంత ప్రాధాన్యత
1 min read

వైసీపీ ప్రభుత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ కాదు కరెప్షన్ ప్రాసెసింగ్‌గా చేశారు
అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు, న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. అసెంబ్లీలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని కరెప్షన్ ప్రాసెసింగ్‌గా మార్చేసిందన్నారు. అప్పట్లో తీసుకువచ్చిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభం అవ్వలేదన్నారు. పులివెందులలో రూ.3.9 కోట్లతో అరటి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేసినప్పటికీ ప్రారంభం అవ్వలేదన్నారు. దీనిని ఏం చేయాలన్న దానిపై పరిశీలిస్తున్నామన్నారు. కోట్ల రూపాయలు వృథా అవ్వకుండా తగిన విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 2024-29 ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఎంతో బాగుందని మంత్రి చెప్పారు. క్యాపిటల్ సబ్సీడీ, పవర్ కాస్ట్ రీయింబర్స్‌మెంట్, స్కిల్ అప్‌గ్రెడేషన్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఎలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడితే బాగుంటుందన్న దానిపై వర్క్‌వుట్ చేస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కింద 200 ఎకరాల్లో 2 మల్టీ ప్రాడక్ట్స్ ఫుడ్ పార్కులు రాబోతున్నాయన్నారు. ఈ ప్రాంతంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు స్థాపించేందుకు ప్రోత్సహిస్తామన్నారు.

