విద్యార్థులను అభినందించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నేషనల్ యూత్ ప్రాజెక్టు వారు నిర్వహిస్తున్న భారత్ కి సంతాన్ కార్యక్రమానికి కర్నూలు జిల్లా నుంచి ఎంపికైన టీజీవి ఫైన్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన కూచిపూడి విద్యార్థినులను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఈరోజు అభినందించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, భారత్ కి సంతాన్ కార్యక్రమానికి దక్షిణ భారతదేశం నుంచి మొత్తం 14 మందిని ఎంపిక చేయగా అందులో కర్నూల్ నగరానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఎన్నిక కావడం మన కర్నూలు జిల్లాకే గర్వకారణం అని అన్నారు.భారత్ కి సంతాన్ కార్యక్రమానికి ఎన్నికైన మీరు నేషనల్ యూత్ ప్రోగ్రాం వారు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటూ దేశంలో ఉన్న వివిధ భాషలు వాటి సంస్కృతి సంప్రదాయాలను వివరిస్తూ ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా మీరు ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఉన్న తిరుచూరులో శిక్షణ పొంది రావడం అభినందనీయమన్నారు. అలాగే టీజీవి ఫైవ్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ కేవీ భార్గవ్ కుమార్ 14 దేశాలతో కూడిన సౌత్ ఏసియా సమైక్యత సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎంపిక కావడం అభినందనీయమని టీజీ వెంకటేష్ అన్నారు. నేషనల్ యూత్ ప్రాజెక్టువరి భారత్ కి సంతాన్ కార్యక్రమ నిర్వాహకుడిగా, అలాగే శిక్షకుడిగా ఎన్నిక కావడం మన జిల్లాకే గర్వకారణం అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.వి భార్గవ్ కుమార్ ను అలాగే భారత్ కి సంతానం కార్యక్రమానికి ఎన్నికైన కూచిపూడి విద్యార్థులు లిఖిత, సత్యశ్రీ, మధుహాసిక లను టీజీ వెంకటేష్ అభినందించారు.

