టిడిపి మాజీ లీగల్ సెల్ ప్రెసిడెంట్,ఈడ్పుగంటి శ్రీనివాసరావును పార్టీ నుండి సస్పెండ్
1 min read
జిల్లా అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా వ్యవహరించిన టిడిపి మాజీ లీగల్ సెల్ ప్రెసిడెంట్, కార్యకర్త ఈడ్పుగంటి శ్రీనివాసరావును పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఏలూరులోని జిల్లా తెలుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈడ్పుగంటి శ్రీనివాసరావు పదేపదే మీడియా సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యే చింతమనేనిపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటూ ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా ప్రస్తావించడాన్ని ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షులు బడేటి చంటి ఖండించారు. ఈ విషయమై ఇప్పటికే ఒకసారి పిలిచి మాట్లాడి పద్దతి మార్చుకోవాలని చెప్పామన్నారు. ఏదైనా ఉంటే పార్టీ అధిష్టానంతో చర్చించాలే గానీ, మీడియా సమావేశాలు పెట్టి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడవద్దని సూచించామన్నారు. అయినా పద్దతి మార్చుకోని ఈడ్పుగంటి శ్రీనివాసరావు మరోసారి మీడియా సమావేశంలో తన ఇష్టారీతిగా మాట్లాడడాన్ని తప్పుపట్టారు. దీంతో అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బడేటి చంటి ప్రకటించారు. ఒక ప్రజాప్రతినిధిని ఇష్టానుసారంగా నిందిస్తూ మీడియాతో మాట్లాడిన తీరుపై ఈడ్పుగంటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరినట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం ఈడ్పుగంటిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నివేదికను దెందులూరు నియోజకవర్గ నాయకులకు అందజేశారు. మీడియా సమావేశంలో టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

