54వ నెలలోనూ ఆగని మానవతా సేవలు
1 min read
– అనాథ వృద్ధులు, వికలాంగులు, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన స్వామి వివేకానంద ట్రస్ట్, భారత్ యూత్ అసోసియేషన్
ప్రతి నెల సేవే లక్ష్యంగా అర్హులైన నిరుపేదలను గుర్తించి సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్న సేవా సంస్థలు
హోళగుందన్యూస్ నేడు: సమాజ సేవే పరమోన్నత ధర్మమనే లక్ష్యంతో స్వామి వివేకానంద ట్రస్ట్, ఆదోని మరియు భారత్ యూత్ అసోసియేషన్, హోళగుంద సంయుక్త ఆధ్వర్యంలో వరుసగా 54వ నెల కూడా అనాథ వృద్ధ మహిళలు, వికలాంగులు, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన హోటల్ ఈరన్న–ఎర్రమ్మ దంపతులకు, మార్లమడికి గ్రామానికి చెందిన వృద్ధురాలు రాధమ్మకు, గ్రామానికి సేవలందిస్తున్న గుర్ఖా నిరుపేద కుటుంబానికి బియ్యం, కిరాణా సరుకులు తదితర నిత్యావసర వస్తువులను అందజేశారు.సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారు, అనాథ వృద్ధులు, వికలాంగులు, నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి నిరంతరం అండగా నిలవడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి నెల ప్రజల సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ, అర్హులైన వికలాంగులకు సేవా సహాయక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.గత 54 నెలలుగా ఎలాంటి విరామం లేకుండా సేవా కార్యక్రమాలను కొనసాగించడం అభినందనీయమని గ్రామ ప్రజలు కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించి సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎం. రవికాంత్, శ్రీధర్, సి. రాజా తదితరులు పాల్గొని నిత్యావసర సరుకుల పంపిణీలో సహకరించారు.


