NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలి

1 min read

మంత్రి లోకేష్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనం: వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కె. గిరి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని అన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రమాదంలో కార్మికులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సమయంలో కార్మిక సంఘాల నాయకులు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరితే, “మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా?” అని ప్రశ్నించడం తగదని అన్నారు. ప్రజాప్రతినిధులు బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాల్సి ఉండగా, ఇటువంటి వ్యాఖ్యలు అహంకారపూరిత ధోరణిని సూచిస్తున్నాయని పేర్కొన్నారు.ఇలాంటి వైఖరి గతంలో కూడా కనిపించిందని, గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన ప్రమాదాలపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రజలు మరచిపోలేదన్నారు. ఇప్పుడు అదే ధోరణి మంత్రి లోకేష్ వ్యాఖ్యల్లో కనిపిస్తోందని విమర్శించారు.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అనుభవజ్ఞులైన కార్మికులను తొలగించడం, సిబ్బంది కొరత వంటి కారణాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. కార్మికుల భద్రత విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందించారని గుర్తుచేస్తూ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.

About Author