విద్యాసంస్థల్లో బాలికలకు కరాటే సాధన తప్పనిసరి చేయాలి
1 min read

కరాటే క్రీడాకారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
కర్నూలు,న్యూస్ నేడు: 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేంతవరకు విద్యాసంస్థల్లో బాలికలకు ఆత్మ రక్షణ కోసం కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణను తప్పనిసరి చేయాలని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని సంకల్ బాగ్ లో ఉన్న చిన్మయ విద్య మిషన్ లో కరాటే మాస్టర్ ఆరిఫ్ ఆధ్వర్యంలో కోయంబత్తూరు వెళ్లి అక్కడి సెమినార్ లో సర్టిఫికెట్లు సాధించిన క్రీడాకారులకు ఆయన సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలికలు ,మహిళలకు ఆత్మ రక్షణ తప్పనిసరి అని చెప్పారు. ఇందుకోసం కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇవ్వడం వల్ల వారికి అది రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. సమాజంలో ప్రస్తుతం డ్రగ్స్ వినియోగం అధికం కావడం వల్ల ప్రతిరోజు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, వీటిని ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాలలో చూసినప్పుడు ఆందోళన కలుగుతుందని వెల్లడించారు. చాక్లెట్ల రూపంలో గంజాయి వినియోగం అధికమవుతుందని, మనిషిని మనిషిని నాశనం చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు .అందుకే విద్యార్థి దశ నుండే పాఠశాలల్లో విద్యార్థులు చెడు అలవాట్లకు గురి కాకుండా ,పెద్దలపట్ల గౌరవంతో ఉండేలా, క్రమశిక్షణ, అంకితభావంతో మెలిగేలా, సామాజిక బాధ్యతను పెంపొందించేలా, పరస్పరం సహకారం అందించుకునేలా నైతిక విలువలతో కూడిన విద్యను బోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మొక్కై వంగనిది మానై వంగదని, ఈ సామెతలు గుర్తుంచుకొని భావి భారత పౌరులు అయిన విద్యార్థులు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగేందుకు విద్యార్థి దశ నుంచే పునాది వేయాలని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల వారిలో ఏకాగ్రత , దేహ దారుఢ్యం పెరగడంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యము మెరుగు పడుతుందని, సుదీర్ఘంగా శ్వాస తీసుకోవడం వల్ల కార్బన్డయాక్సైడ్ బయటికి వెళ్లి శరీరం అంతా ఆక్సిజన్ నిండి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు .విద్యార్థులు మంచి అలవాట్లతో ఉండాలని, వీధిలో దొరికే ఆహార పదార్థాలను తినకుండా, అలాగే ఫాస్ట్ ఫుడ్ ,జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండాలని సూచించారు. వీటిని తినడం వల్ల జీవనశైలికి సంబంధమైన బిపి ,షుగర్, ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు చిన్న వయసులోనే తలెత్తే అవకాశం ఉందని తెలియజేశారు. అలాగే కలుషితమైన నిరు తాగకుండా ఉండాలని, కలుషిత నీరు తాగితే టైఫాయిడ్ గ్యాస్ట్రోఎంటరైటిస్, హెపటైటిస్ వంటి వ్యాధులు వస్తాయని తెలిపారు .ఏ దేశ భవిష్యత్తు అయినా ఆదేశ తరగతి గదుల్లోనే తయారవుతుందని, అందుకే విద్యార్థులను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కృషి జరగాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు.

