పత్తికొండలో ఘనంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి వేడుకలు
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ : పత్తికొండ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో గురువారం లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కార్యదర్శి తూముకుంట ప్రతాపరెడ్డి, లోకేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ పోషించిన కీలక పాత్రను, ఆయన చేసిన పోరాటాన్ని వివరించారు. ప్రజలను ఏకం చేయాలనే ఉద్దేశంతో బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. పత్తికొండ నియోజకవర్గంలోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలకు చెందిన గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు హాజరయ్యారు. మండల కమిటీలను వెంటనే పూర్తి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.పత్తికొండ పట్టణంలో ఐదు రోజుల పాటు గణేష్ ఉత్సవాలు నిర్వహించాలనే డిమాండ్‌పై గత నాలుగు సంవత్సరాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్నామని నాయకులు తెలిపారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వంతో, ప్రజాప్రతినిధులతో, అధికారులతో సమన్వయం చేసుకుంటూ, శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా మరియు రాష్ట్ర కమిటీల సహకారంతో పత్తికొండ పట్టణంలోని సుమారు 130 గణేష్ మండపాల నిర్వాహకుల కోరిక మేరకు ఐదు రోజుల పాటు గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కర్నూలు జిల్లా కార్యదర్శులు వీర్రాజు, రామలింగయ్య, గోవర్ధన్ నాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు మేనుగ రాజేష్, సంగు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.


