రేపటితో ముగియనున్న ఎల్‌ఆర్‌యస్ మేళా
1 min read
క్రమబద్ధీకరించుకోని ప్లాట్లపై కఠిన చర్యలు
నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం నగర పరిధిలో ఉన్న అనధికార లేఅవుట్లలో ప్లాట్లను క్రమబద్ధీకరణకు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌యస్) కు దరఖాస్తు చేసుకున్న వారు ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకునేందుకు ఏర్పాటు చేసిన ఎల్‌ఆర్‌యస్ మేళా ఆదివారంతో ముగియనుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శనివారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలో నిర్వహించిన మూడో రోజు ఎల్‌ఆర్‌యస్ మేళాలో పాల్గొన్న ఆయన, ఎల్‌ఆర్‌యస్ ప్రక్రియ పూర్తి చేసుకున్న దరఖాస్తుదారులకు అప్రూవల్ ప్రొసీడింగ్స్ అందజేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్‌ఆర్‌యస్ దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఎల్‌ఆర్‌యస్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం ప్రారంభమైన ఈ మేళా ఆదివారంతో ముగియనుందని పేర్కొన్నారు. గడిచిన మూడు రోజుల్లో మొత్తం 102 దరఖాస్తులకు అప్రూవల్ ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరిగిందని, తద్వారా రూ.90.76 లక్షల ఫీజులు వసూలైనట్లు వెల్లడించారు.ఎల్‌ఆర్‌యస్ ప్రక్రియను పారదర్శకంగా, సులభంగా పూర్తి చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ తెలిపారు. పట్టణ ప్రణాళిక అధికారులు, ప్లానింగ్ కార్యదర్శులు, ఎల్‌టిపిలు ఒకేచోట అందుబాటులో ఉండటంతో దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే క్రమబద్ధీకరణ చేయించుకోని ప్లాట్లపై భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

