నాగటూర్ కాలువకు పునర్జీవం…
1 min read
జలధార పారితేనే రైతన్న ముఖంలో వెలుగు
జలధార చేరడంతో 350 ఎకరాల్లో పచ్చని ఆశలు
జలధారతో కళకళలాడనున్న నాగటూర్ పొలాలు
ఉపాధి హామీతో జలహారతి… రైతులకు సాగునీటి భరోసా
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని నాగటూర్ గ్రామం… పేరు చిన్నదైనా, అక్కడి రైతుల కష్టం ఎంతో పెద్దది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి చెరువులు లేవు… కుంటలు లేవు… రైతులకు జీవనాధారం ఒక్కటే – నీలగండి నుండి కృష్ణా నది వరకు ప్రవహించే ప్రధాన కాలువ. కేసీ కెనాల్ నీళ్లు ఈ కాలువలో ప్రవహించి, అక్కడి నుండి పిల్లకాల్వల ద్వారా పొలాలకు చేరుతాయి. ఆ నీరే నాగటూర్ రైతుల పంటలకు ప్రాణాధారం. ఈ కాలువ కింద దాదాపు 150 మంది రైతులకు చెందిన 350 ఎకరాల సాగుభూమి ఉంది. వరి, మొక్కజొన్న, మినుములు, కందులు వంటి పంటలు ఇక్కడ ప్రధానంగా సాగవుతుంటాయి. అయితే గత కొన్ని నెలలుగా కాలువలో భారీగా పూడిక పేరుకుపోవడంతో నీటి ప్రవాహం తగ్గిపోయింది. పైభాగంలోనే నీరు నిలిచిపోవడంతో కింది భూములకు నీళ్లు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాగు విస్తీర్ణం తగ్గడమే కాకుండా దిగుబడులు కూడా గణనీయంగా పడిపోయాయి.ఈ సమస్యను గుర్తించిన గ్రామ ప్రజలు, రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన జిల్లా యంత్రాంగం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పూడికతీత పనులకు ఆమోదం తెలిపింది. రూ.6.12 లక్షల వ్యయంతో పనులు మంజూరు చేసి ఆలస్యం చేయకుండా ప్రారంభించారు.గత రెండు వారాలుగా ప్రతిరోజూ సుమారు 120 మంది శ్రామికులు కాలువలో పూడికతీత పనులు చేస్తున్నారు. శ్రమజీవుల చెమటతో కాలువ మళ్లీ పునర్జీవం పొందుతోంది. ఎన్నాళ్లుగానో పూడికతో మూసుకుపోయిన మార్గం ఇప్పుడు మళ్లీ నీటి ప్రవాహానికి సిద్ధమవుతోంది.కాలువలో పూడిక తొలగించడంతో నీరు ఇప్పుడు సాఫీగా కింది భూముల వరకు చేరుతోంది. దీంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. రానున్న పంటకాలంలో సాగుభూమి పెరగడంతో పాటు దిగుబడులు కూడా మెరుగుపడతాయని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రైతులకు నీటి సమస్య పరిష్కారం కాగా, మరోవైపు గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకాశాలు కలగడం ఈ పనుల ప్రత్యేకతగా నిలిచింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ, జలధార – జల హారతి కార్యక్రమం కింద “గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం చూపడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఉపాధి హామీ పథకాన్ని కేవలం కూలి పనులకే పరిమితం చేయకుండా, గ్రామాలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. నాగటూర్ కాలువ పూడికతీత ద్వారా రైతులకు సాగునీరు అందడమే కాకుండా భూసార పరిరక్షణ, దిగుబడి పెరుగుదల, గ్రామీణ ఉపాధి – all in one విధంగా ప్రయోజనం కలుగుతోంది. రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది… గ్రామం బాగుంటే జిల్లా అభివృద్ధి చెందుతుంది,” అని తెలిపారు.గ్రామస్థులు కూడా జిల్లా పరిపాలనకు కృతజ్ఞతలు తెలుపుతూ, “ఎన్నో సంవత్సరాల తరువాత మా కాలువకు మళ్లీ జీవం వచ్చింది. ఇప్పుడు మా పొలాలకు నీళ్లు వస్తున్నాయి. ఈసారి పంట బాగుంటుందనే నమ్మకం కలిగింది,” అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పనులు గ్రామీణ జీవితాల్లో ఎలా మార్పు తీసుకురాగలవో నాగటూర్ గ్రామం నేడు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.


