మన ఓటు – మన హక్కు… ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం
1 min read
ఎస్‌ఐఆర్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
ప్రతి ఓటు అమూల్యం… ప్రతి ఓటరు తప్పనిసరిగా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి – ఎమ్మెల్యే పిలుపు
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) వెరిఫికేషన్ ప్రక్రియను ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి శనివారం ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంతో పాటు ఆలూరు పట్టణంలోని 133, 134, 135 పోలింగ్ బూత్‌లలో ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, వెరిఫికేషన్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులతో పాటు బూత్ స్థాయి ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు వివరాలను ఒకసారి తప్పనిసరిగా పరిశీలించి, అవసరమైన వెరిఫికేషన్‌ను పార్టీ బీఎల్‌ఏలు, సంబంధిత బీఎల్‌ఓల సహకారంతో పూర్తి చేసుకోవాలని సూచించారు. చిన్న నిర్లక్ష్యం వల్ల ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఓటు హక్కును కాపాడుకోవడం అత్యంత కీలకమని పేర్కొన్న ఎమ్మెల్యే, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి పౌరుడు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రామాలు, వార్డులు, బూత్ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు.పార్టీ అందుబాటులోకి తీసుకువచ్చిన మై బూత్ – మై ఓటర్ యాప్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. యాప్ ద్వారా ఓటరు వివరాలను పరిశీలించడంతో పాటు అవసరమైన సవరణలు చేసుకునే అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్లు ఎలాంటి కారణాలతోనూ తొలగించబడకుండా బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, ఫారాల పంపిణీలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని బూత్ స్థాయి ప్రతినిధులకు ఆదేశించారు.క్షేత్రస్థాయిలో బీఎల్‌ఏలకు ఎదురవుతున్న సమస్యలు, సందేహాలను ఎమ్మెల్యే స్వయంగా తెలుసుకుని వాటిపై వివరణ ఇచ్చారు. వెరిఫికేషన్ సమయంలో పాటించాల్సిన విధానాలు, అవసరమైన పత్రాలు, ప్రజలకు అవగాహన కల్పించే విధానంపై దిశానిర్దేశం చేశారు. ప్రతి పోలింగ్ బూత్‌లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ముఖ్యమైన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఓటు హక్కు పరిరక్షించబడుతుందని, ప్రతి కుటుంబాన్ని సంప్రదించి వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


