పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఎస్‌యూసీఐ(కమ్యూనిస్టు) పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా ఇంచార్జీ వి. హరీష్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహిస్తూ కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. ఇటీవల పది రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.8 మేర, వంటగ్యాస్ ధరను రూ.60 మేర పెంచడం ప్రజలపై మరింత భారాన్ని మోపిందన్నారు.రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అధిక ధరలకు కొనుగోలు చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకులు, ఎరువులు, మందుల ధరలు పెరిగి ప్రజల జీవితం దుర్భరంగా మారిందని, కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు మోపడం అన్యాయమని విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, ధరల భారానికి వ్యతిరేకంగా జూన్ 9న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే రాస్తారోకోలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు నాగన్న, తేజోవతి, ఖాదర్, విశ్వనాథ్, మల్లేష్, ప్రియాంక, శక్రప్ప, సుజాత, వాసు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

