ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేలా పోలింగ్ కేంద్రాలు
1 min read
అదనంగా 60 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్ విశ్వనాథ్
కర్నూలు, న్యూస్ నేడు: శుక్రవారం నియోజకవర్గంలో ఓటర్లు సౌకర్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అందరికీ అందుబాటులో ఉండేలా అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శుక్రవారం నగరపాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కర్నూలు నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న 258 పోలింగ్ కేంద్రాలకు అదనంగా మరో 60 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూపొందించిన ప్రతిపాదనలపై ఆర్వో చర్చించారు. గతంలో ఓటర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఒక్కో పోలింగ్ బూత్‌లో 1200 మంది వరకు ఓటర్లు ఉండేలా చూసుకొని అధికారులు, బిఎల్వోలు సంయుక్తంగా 60 పోలింగ్ బూత్‌లను గుర్తించామన్నారు. వీటిపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 27 లోపు తెలియజేయాలని సూచించారు. అందరి ఆమోదంతోనే ఎన్నికల సంఘానికి నూతన పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, సూపరింటెండెంట్ సుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు.

