రవీంద్ర పాఠశాల వార్షికోత్సవం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక అబ్బాస్ నగర్ లోని రవీంద్ర బాలికల పాఠశాల వార్షికోత్సవం సి. క్యాంపు నందు టీజీవి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగినది. రవీంద్ర విద్యాసంస్థల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ అధ్యక్షతన నిర్వహింపబడిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వి ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి. వినుషా రెడ్డి , త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. శేషయ్య, రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ వినుషా రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ నేడు ప్రభుత్వాలు మహిళలకు అనేక రంగాలలో అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసము 33% రిజర్వేషన్లు తీసుకొని రావడం జరిగింది. ఈ రిజర్వేషన్లు ఉపయోగించుకొని పంజరంలోనుండి బయటపడిన పక్షి, ఆకాశంలో ఎంతో స్వేచ్ఛగా విహరిస్తున్నట్టుగా సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాలలో ఆరితేరి సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉందన్నారు. భూదేవి వాలె సహనంతో, సరస్వతీ దేవి వలె శాంతంతో, లక్ష్మీదేవి వలే సౌభాగ్యముతో మహిళలు అన్ని రంగాలలో ఆరి తేరాలన్నారు. స్త్రీలకు ప్రపంచ దేశాలలో ఎక్కడా లభించని మర్యాదలు భారతదేశంలో స్త్రీకి లభిస్తుందన్నారు. ప్రతి స్త్రీ ఒక శక్తిగా ఎదగాలని సమాజ అభ్యుదయములో భాగస్వామి కావాలని గుర్తు చేశారు. భారతదేశముపై తీవ్రవాదులు జరిపిన దాడిలో ఎందరో ప్రాణాలు కోల్పోతే మన భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఉగ్రవాదులను ఉర్విలో కలిపేసిందన్నారు. భరతమాత నుదుటి సింధూరాన్ని స్త్రీ శక్తిగా అభివర్ణించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ పి శేషయ్య మాట్లాడుతూ సమాజంలో వింత పోకడలు పెట్రేగిపోతున్న ఈ రోజుల్లో అమ్మాయిలు ఆత్మ రక్షణ కోసం దృడచిత్తులై ఉండాలన్నారు.మహిళలు ఎల్లప్పుడూ నిఘా నేతులై తమ పరిసరాలను పరిశీలిస్తూ ముందడుగు వేయాలన్నారు. అనంతరం రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి.పులయ్య మాట్లాడుతూ బాలికా విద్య ఆవశ్యకతను గుర్తెరిగి మేము పాఠశాల స్థాయి నుండి ప్రత్యేకంగా బాలికల పాఠశాల,జూనియర్ కళాశాల,డిగ్రీ కళాశాల,ఇంజనీరింగ్ కళాశాలలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు పుట్టినింటికి, మెట్టినింటికి వారధిగా నిలుస్తూ కుటుంబాన్ని ముందుకు నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల వై చైర్మన్ జి.వంశీధర్, టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు ప్రతి ఓబులయ్య, రవీంద్ర గ్లోబల్ స్కూల్ కో సిఇఓ శ్రీమతి సుప్రియ పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.


