సారా విక్రయదార కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపండి
1 min read
నాటు సారా వల్ల కలిగే అనర్ధాలను తెలియజేయండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: నాటు సార విక్రయదార కుటుంబాల జీవనోపాధికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా నాటుసార కుటుంబాల పునరావాస వ్యూహం మరియు కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో నంద్యాల డిఎస్పీ మంద జావలి అల్ఫోన్స్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్, మెప్మా పిడి వెంకట దాసు, డిఆర్డిఎ పిడి శ్రీధర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాటు సారా విక్రయదార కుటుంబాలను పునరావాసం కల్పనలో భాగంగా నవోదయం 2.0 కార్యక్రమం వారి జీవనోపాధి కోసం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఏ కేటగిరీలో 19 గ్రామాలు, బి కేటగిరీలో 19 గ్రామాలు, సి కేటగిరిలో 91 గ్రామాలను జిల్లాలో నాటు సారాను పూర్తి స్థాయిలో నివారించడానికి 19 ఫిబ్రవరి 2025 నుండి సెప్టెంబరు 12వ తేది వరకు పకడ్బందీ ప్రణాళిక వారీగా నాటు సారా తయారీని పూర్తి స్థాయిలో తొలగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. నాటు సార, కల్తీ నెయ్యి లాంటి ప్రాణాంతకమైన వాటిని చేయడం ద్వారా ప్రజా ఆరోగ్యం పట్ల చెలగాటం ఆడడం వల్లనే మీ మీద కేసులు నమోదవ్వడం జరుగుతోందన్నారు.అంతకుముందు నాటు సార విక్రయదార కుటుంబాల జీవనోపాధికి కల్పించాల్సిన సదుపాయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

