ఎస్టేట్ అధికారిణి కల్యాణి బదిలీ రద్దు చేయాలని జేసీకి వినతి
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: క్యాంప్ రైతు బజార్ ఎస్టేట్ అధికారిణి కల్యాణి బదిలీ ఉత్తర్వులను రద్దు చేసి, ఆమెను అదే స్థానంలో కొనసాగించాలని కోరుతూ రైతులు, మహిళా పొదుపు సంఘాల సభ్యులు, నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా కర్నూలు రైతు సంఘాల ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, కల్యాణి రైతు బజార్ అభివృద్ధికి, రైతుల సమస్యల పరిషారానికి, మహిళా పొదుపు సంఘాల సభ్యులతో సమన్వయం సాధించడంలో విశేష సేవలు అందించారని తెలిపారు. ఆమె కృషి వల్ల రైతులు, మహిళా సంఘాల సభ్యులు ప్రయోజనం పొందడమే కాకుండా రైతు బజార్ నిర్వహణ కూడా సమర్థవంతంగా సాగుతోందని పేర్కొన్నారు.ప్రస్తుతం ఆమె బదిలీ కారణంగా రైతు బజార్ నిర్వహణతో పాటు రైతులు, మహిళా పొదుపు సంఘాల కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.రైతులు, మహిళా పొదుపు సంఘాల సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, కల్యాణి బదిలీ ఉత్తర్వులను పునఃపరిశీలించి రద్దు చేసి, ఆమెను అదే స్థానంలో కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్‌ను వినయపూర్వకంగా కోరారు.


