ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం… ఆర్డీవో అరుణ దేవి
1 min read
ఆదోని, న్యూస్ టుడే: ప్రజల సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదోని ఆర్డీవో కె. అరుణ దేవి తెలిపారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, వారసత్వ మార్పులు, పింఛన్లు, సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలను ప్రజలు సమర్పించారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుల సమస్యలను ఓపికగా విన్న ఆర్డీవో, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ప్రతి ఫిర్యాదును నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పరిష్కరించి అర్జీదారులు సంతృప్తి చెందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికని, ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.


