సుళువాయి గ్రామంలో ఘనంగా నిర్వహించిన “బడి పిలుస్తోంది”
1 min read
హోళగుందన్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం సుళువాయి గ్రామంలో సోమవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల సంయుక్త ఆధ్వర్యంలో “బడి పిలుస్తోంది” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ-2) పి. కబీర్ సాబ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి , ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. ఈరన్న , పాఠశాల కమిటీ చైర్మన్ మహేష్ , సీఆర్పీ తుకారం , ఎంవీఎఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు ముల్లా సాబ్ గారు, దేవేంద్ర , ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమంలో భాగంగా 5 సంవత్సరాలు నిండిన అంగన్వాడీ చిన్నారులను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలాగే గ్రామంలో బడి మానేసిన 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులను గుర్తించి, వారిని తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అవగాహన కల్పించారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరించారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ సభ్యులు పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి “ప్రతి చిన్నారి బడికి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అధికారులు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి చిన్నారుల పేర్లను పాఠశాల ప్రవేశాల రికార్డుల్లో నమోదు చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్య, పోషకాహార మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫార్మ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, షూస్ మరియు ఇంగ్లీష్ అభ్యాసానికి ప్రత్యేక డిక్షనరీల వంటి సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు.గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు మరియు విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో “బడి పిలుస్తోంది” కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.


