ప్లాస్టిక్ వ్యర్దాలతో జీవావరణంకు తీవ్ర ముప్పు
1 min read
నివారణకు గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళికలు అమలు చేయాలి
జిల్లాపంచాయతీ అధికారి జి.వి. కె మల్లికార్జునరావు
జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో స్వచ్చాంధ్ర కార్పోరేషన్ మార్గదర్శకాలు
ఏలూరుజిల్లాప్రతినిధి,న్యూస్ నేడు: ప్లాస్టిక్ వ్యర్దాలతో జీవావరణంకు తీవ్ర ముప్పుఏర్పడటంతో పాటు మానవ మనుడగు పెను ప్రమాదమని,జిల్లాపంచాయతీ అధికారి జి వి కె మల్లికార్జునరావు అభిప్రాయపడ్డారు. మంగళవారం స్థానిక జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం లో స్వచ్చాంధ్ర కార్పోరేషన్ మార్గదర్శకాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని డిప్యుటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణపై శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సంధర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ నియమాలు- 2016 ను అన్ని ప్రాంతాలలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమర్ధవంతంగా అమలు చేయుటకు కృషి చేయాలని కోరారు. ఘన వ్యర్దాల నిర్వహణ నియమాలు – 2026 నందలి నియమాలు అనుసరించి బల్క్ వేస్ట్ ఉత్పత్తి దారులను గుర్తించాలని, తడి, పొడి వ్యర్దాలను గృహస్థాయిలోనే వేరు చేయడం, సక్రమంగా రవాణా చేయడం, తడి చెత్త నుండి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం విధిగా జరగాలని, స్వచ్చ రధం పధకం లో పొడి చెత్త ద్వారా వచ్చే గృహ వినియోగ వస్తువులపై ప్రజలలో అవగాహన కల్పించాలని ఆయన కోరారు.నూజివీడు డివిజనల్ పంచాయతీ అధికారి పి ఎస్ సుందరి మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ నియమాలు అనుసరించి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగినవి ఒకసారి వాడుకుని పారవేసే ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేదించాలని అన్నారు. ప్రజలలో అవగాహన, చైతన్యం తీసుకు రావడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవచ్చని సుందరి అన్నారు. జిల్లా ట్రైనింగ్ మేనేజర్ గుర్రాల ప్రసంగి రాజు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి మరియు జీవరాసులకు తీవ్రమైన నష్టాలు కలుగుతున్నాయన్నారు. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని అందువలన భూమి, నీరు మరియు గాలిని కలుషితం చేస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో వాడే రసాయనాల వల్ల క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత, మరియు శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని ప్రసంగి రాజు అన్నారు.
మాస్టర్ ట్రైనర్స్ జి ఆర్ మనోజ్, జి డి శ్రీనివాసరావులు, వై.యు.వి.సూర్యకుమార్,ఎస్ బి ఎమ్ కన్సల్టెంట్ లు సురేష్ ,ప్రేమ్ జిత్ ,ఉషా తదితరులు శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలోని డివిజనల్ పంచాయతీ అధికారులు, డీప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఉపాధి హామీ పధకం అదనపు ప్రోగ్రామ్ అధికారులు హాజరయ్యారు.

