కార్యకర్తల గౌరవాన్ని కాపాడే పార్టీ టీడీపీ
1 min read
టీడీపీ జిల్లా కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి కేపీ సారథి
జగన్ కుటిల రాజకీయాలపై ఫైర్..
తిరుపతి లడ్డూ కల్తీ కాలేదని నిరూపించే దమ్ము పేర్ని నానికి ఉందా..?
నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న సారథి
పామర్రు (నిమ్మకూరు) న్యూస్ నేడు : కార్యకర్తల గౌరవాన్ని కాపాడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు స్వగ్రామమైన పామర్రు మండలం నిమ్మకూరులో జరిగిన టీడీపీ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు హాజరైన వేలాది మంది టీడీపీ కార్యకర్తలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. జగన్ మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని లెక్క చేయకుండా ప్రజల్లో కార్యకర్తలు గౌరవంగా తిరగాలన్న ఉద్దేశంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని, పెట్టుబడులను అడ్డుకునే విధంగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ద్వజమెత్తారు. అత్యంత నీచ ప్రవృత్తితో జగన్ వ్యవహరిస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించే అవకాశం ప్రజలు ఇస్తే అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూని కల్తీ మయం చేసిన దుర్మార్గుడు జగన్ అని ద్వజమెత్తారు. ఏడుకొండల వెంకన్న స్వామి సమక్షంలో మహాపాపానికి ఒడిగట్టారన్నారు. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందో చెప్పడానికి పేర్ని నాని సిద్ధంగా ఉన్నాడా..? అని ప్రశ్నించారు. ఈ విషయంలో పేర్ని నానితో చర్చకు తాను సిద్ధమన్నారు. మచిలీపట్నం కోనేరుసెంటర్ వస్తాడో..? విజయవాడ బెంజ్ సర్కిల్ వస్తాడో పేర్ని నాని చెప్పాలన్నారు. ఈ చర్యలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ఇంటింటికి తెలియజేసి 2019 ఎన్నికల్లో ఏ విధంగా జిల్లాలో క్లీన్ స్వీప్ చేశామో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ సాధించాలన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు విషం కక్కుతున్నారని, దీన్ని కూటమి శ్రేణులు తిప్పికొట్టాలన్నారు. గురుమూర్తి నాయకత్వంలోని టీడీపీ జిల్లా కార్యవర్గంపై బృహత్తరమైన బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించారన్నారు. జగన్ కుటిల రాజకీయాలను తిప్పికొట్టడంతోపాటు పార్టీని నమ్ముకున్న కార్యకర్తల సంక్షేమానికి గురుమూర్తి పని చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న గురుమూర్తి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కష్టపడిన గురుమూర్తి లాంటి ధీశాలికి టీడీపీ జిల్లా పగ్గాలు అప్పగించడం హర్షనీయమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ పక్క అభివృద్ధి కార్యక్రమాలతోపాటు మరో పక్క సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. 11 సీట్లు ఇచ్చి ప్రజలు చీకొట్టినా వైసీపీ నేతల బుద్ధి మారడం లేదన్నారు. ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ జగన్ లాంటి దుర్మార్గుడిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. జగన్ కు తాను అన్నం పెడితే నాకు సున్నం పెట్టాడని విమర్శించారు. చివరిగా మాట్లాడిన ఎన్టీ రామారావు తనయుడు నందమూరి హరికృష్ణ టీడీపీ జిల్లా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రి స్వగ్రామం నిమ్మకూరులో ప్రమాణస్వీకారం చేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తెలుగోడు ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. కార్యకర్తల సంక్షేమానికి నూతన కార్యవర్గం కృషి చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.


