కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంది…
1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
7వ పారా స్విమ్మింగ్ పూల్ ఛాంపియన్ షిఫ్ పోటీలు
పోటీలను ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే , పారా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : సమాజంలోని అందరితోపాటు దివ్యాంగులకు కూడా మెరుగైన అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్,పారా స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు స్పష్టం చేశారు.పారా స్పోర్ట్స్ ను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో విశాఖపట్నంలో 22 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరులోని ఏఎస్ఆర్ స్టేడియం వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ఏడవ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తో కలిసి రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఈ పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వారి పాలిట దైవంగా నిలుస్తున్నారని కొనియాడారు. దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని ఆరువేల రూపాయలకు పెంచి వారికి అండగా నిలిచిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పారా స్పోర్ట్స్ లో రాణిస్తున్న దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. డీఎస్సీలో 15 మంది దివ్యాంగులకు కేవలం స్పోర్ట్స్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం గర్వకారణమని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ దివ్యాంగులకు అనేక మేళ్లు చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగునికి పెన్షన్ అందజేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ మొత్తాన్ని అందజేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి,మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి రామస్వామి, జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి రాంకుమార్, గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ విశాలి, డిఎస్ డివో బుద్దాల శ్రీనివాసరావు,పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చల్లా జాకబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయునిగా అవకాశం దక్కించుకున్న బలగా గణేష్ ను సత్కరించి సన్మానించారు.


