రైతు రక్షణ కోసం రైతు సంఘం కృషి అభినందనీయం
1 min read
రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయండి
హలో రైతన్న-ఛలో ఏలూరు కరపత్రాలు ఆవిష్కరణలో ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి పిలుపు
ఏలూరుజిల్లా ప్రతి నిధి,న్యూస్ నేడు: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ,రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు బొర్రా గోపీమూర్తి అన్నారు. ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని అల్లూరు సత్యనారాయణ భవనంలో జులై 3న హాలో రైతన్న- ఛలో ఏలూరు కార్యక్రమం రైతు బహిరంగ సభ,ర్యాలీ కరపత్రాలను ఎమ్మెల్సీ గోపీమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ జులై 3,4,5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. జులై మూడున హాలో రైతన్న- ఛలో ఏలూరు పేరుతో రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న రైతుల ర్యాలీ,బహిరంగ సభ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో రైతాంగం,ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్ని పంటల రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందని చెప్పారు. నేడు రైతుల వ్యవసాయం సంక్షోభంలో ఉందని, ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణంగా ఉన్నాయన్నారు. దేశానికి తిండి గింజలు అందిస్తున్న అన్నదాతల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. వ్యవసాయ ఖర్చులను పెంచి వేయడంతో నేడు సాగు భారంగా మారిందని, పెంచిన ఎరువుల ధరలు, ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభలలో వ్యవసాయ రంగ సమస్యలపై చర్చించి తగు తీర్మానాలు చేయనున్నారని వివరించారు. పెండింగ్ లో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి అన్ని పంటలకు మద్దతు ధరలు కల్పించాలని, మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్. లింగరాజు, డి.ఎన్.వి.డి ప్రసాద్, శ్రామిక మహిళా నాయకురాళ్లు విమల, రాజకుమారి, చల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

