విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యం
1 min read
– ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు, న్యూస్ నేడు: విద్యుత్ ప్రమాదాలను నివారించడంలో ప్రజల అప్రమత్తత అత్యంత కీలకమని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీసే ప్రమాదం ఉన్నందున ప్రతి ఒక్కరూ విద్యుత్ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ సూచించారు.సోమవారం కలెక్టరేట్లోని సునయన సమావేశ మందిరంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు సంబంధించిన అవగాహన పోస్టర్ను సంబంధిత అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… విద్యుత్ శాఖ విడుదల చేసిన భద్రతా సూచనలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్నందున రైతులు, గృహ వినియోగదారులు, వ్యాపార సంస్థలు, నిర్మాణ రంగ కార్మికులు, ప్రజలందరూ విద్యుత్ పరికరాలను వినియోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, దెబ్బతిన్న విద్యుత్ తీగలు కనిపించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే విద్యుత్ పనులను అర్హత కలిగిన సిబ్బందితో మాత్రమే చేయించాలని, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకరాదని, పిల్లలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యుత్ సంబంధిత అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాహన పెంపొందించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి భద్రతా మార్గదర్శకాలను పాటించాలని జాయింట్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, శివ ప్రసాద్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

