NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం…

1 min read

పీ4 తొలి సమావేశంలో రాష్ట్ర మంత్రి టీ.జీ. భరత్

పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు పక్కా ప్రణాళికలు

మార్గదర్శి – బంగారు కుటుంబాల ఎంపిక వేగవంతం

2029 నాటికి 100% అర్హులందరికీ ఇళ్ళులు

కర్నూలు, న్యూస్​ నేడు:  శనివారం పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం నగరపాలక కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి స్వర్ణాంధ్ర-పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్షిప్) తొలి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.స్వర్ణాంధ్ర విజన్ -2047 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, మార్గదర్శి – బంగారు కుటుంబాల ఎంపిక అర్హతలు పక్కాగా పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 2029 నాటికి నియోజకవర్గంలో 100% అర్హులందరికీ ఇళ్ళులు తప్పనిసరిగా ఉండాలని, అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మున్సిపల్ పాఠశాలల స్థితిగతులను పరిశీలించి, అవసరమైన ఆధునికీకరణ పనులను చేపట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని, పాతబస్తీలో విచ్చలవిడిగా ఉన్న కరెంట్ తీగల సమస్యను పరిష్కరించాలని సూచించారు. ప్రధాన రహదారుల వెంట గోడలను శుభ్రపరిచి పెయింటింగ్ వెయ్యాలని, మొక్కలు నాటడం మరింత వేగవంతం చేయాలన్నారు. పార్కింగ్, వెండింగ్ జోన్ల ఏర్పాటు, పున్నమి రెస్టారెంట్ వెనుక ఖాళీ స్థలంలో వెండింగ్ జోన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు రహదారులపై ఆక్రమణలు తొలగించాలని, టిడ్కో గృహాల అభివృద్ధికి శ్రద్ధ చూపాలని సూచించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వం రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. తొలి సమావేశంలో పీ4 అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అనేక అంశాలపై చర్చించామని వెల్లడించారు.‌ భవిష్యత్తులో పేదరికం లేని సమాజాన్ని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. అదేవిధంగా తాను ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి 15లక్షల బంగారు కుటుంబాలు, లక్ష మంది మార్గదర్శులను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. పీ4 ద్వారా సంక్షేమ పథకాల కోత ఉండదని, ఇది సంక్షేమానికి అదనమని సీఎం స్పష్టం చేశారు. బంగారు కుటుంబాలకు సరైన సమయంలో సహకారం, నిరంతర గైడెన్స్ ఇవ్వడం వంటివి మార్గదర్శులు బాధ్యత తీసుకుంటారన్నారు.కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, తహశీల్దార్ రవికుమార్, మేనేజర్ యన్.చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఇంచార్జీ ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ లీల ప్రసాద్, హార్టికల్చర్ ఏడి విజయలక్ష్మి, సిఎంఎం భాస్కర్ రెడ్డి, సూపరింటెండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author