ఈ పాసు పుస్తకాలను పరిశీలిస్తున్న రెవెన్యూ యంత్రాంగం
1 min read

మహానంది, న్యూస్ నేడు: గతంలో రీ సర్వే జరిగిన గ్రామాలకు సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన ఈ పాస్ పుస్తకాలను రెవెన్యూ యంత్రాంగం పరిశీలన చేపట్టింది. ఇందులో భాగంగానే మహానంది మండల తహసిల్దార్ కార్యాలయంలో వీఆర్వోలు భూమి యాజమాన్యపు హక్కు పత్రాలు/ పట్టాదారు పాసుపుస్తకం పరిశీలించే కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని నంది పల్లె, మసీదుపురం ,బసాపురం గ్రామాలకు సంబంధించి ఈ పాస్ పుస్తకాలను ప్రభుత్వం విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే అనంతరం అందజేసిన పాస్ పుస్తకాల స్థానంలో వాటిని రద్దుచేసి ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా రాజముద్ర కలిగిన వీటిని రైతులకు అందజేయనున్నట్లు తెలుస్తుంది. గ్రామాల్లో రైతులు ఎందరు వారి పేర్లు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం సరిగా ఉన్నాయా లేదా ఎంతమంది రైతులకు నూతనంగా ప్రభుత్వం విడుదల చేసిన ఈ పాస్ పుస్తకాలు వచ్చాయి వాటిల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా, ఇంకా ఎంతమంది రైతుల పేరు పై ఈ పాస్ పుస్తకాలు రావాల్సి ఉంది తదితర అంశాలపై కూలంకషంగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తుంది. వీటన్నింటినీ పరిశీలించి జిల్లా స్థాయి ఉన్నత అధికారులకు పూర్తి సమాచారాన్ని స్థానిక అధికారులు నివేదిక అందజేయనున్నట్లు సమాచారం .పరిశీలన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే లేదా ఉన్నత స్థాయి అధికారుల చేతుల మీదుగా వీటిని రైతులకు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.


