వివిధ శాఖలకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఈనెల 25 లోగా పూర్తి చేయాలి
1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వివిధ శాఖలకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఈనెల 25వ తేదీ లోగా నూరుశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం జిల్లాలోని సంక్షేమ అభివృద్ధి శాఖలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలు, లక్ష్యసాధనలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా అధికారులు తమ శాఖలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు శ్రద్ద తీసుకోవాలన్నారు. డ్వాక్రా సంఘాల రుణలక్ష్యాలను పూర్తి చేయడంతోపాటు రుణాలతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి యూనిట్లు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ, ఎస్సి కార్పొరేషన్ ద్వారా యువత స్వయం ఉపాధికి రుణ మంజూరు లక్ష్యాలను పూర్తిచేసి, యూనిట్ల ఏర్పాటు వేగవంతం చేయాలన్నారు. పంచాయతీ రాజ్, గృహ నిర్మాణ శాఖ, ఆర్ డబ్ల్యూ ఎస్., సమగ్ర శిక్ష, రోడ్లు, భవనాలు, వంటి ఇంజనీరింగ్ శాఖల అధికారులు చేపట్టిన నిర్మాణ పనులు పూర్తిచేసి, బిల్లులను చెల్లింపు నిమిత్తం వెంటనే ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల సాధనలో వెనుకబడిన అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరుగుతుందని, అందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోనికి మరింత సమర్థవంతంగా తీసుకువెళ్లాలని, జిలాల్లో ప్రజల సంతృప్తి స్థాయి తక్కువగా ఉన్న ప్రభుత్వ సేవల విభాగంలో ప్రజల సంతృప్తి స్థాయిని మరింత పెంచేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమావేశంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు,ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ. భానుప్రతాప్, ఆర్. డబ్ల్యూ. ఎస్.ఎస్ఈ త్రినాధ్ బాబు, ఆర్అండ్ బి ఈఈ వై. వి. కిషోర్ బాబూజీ, డిఎంహెచ్ఓ డా. శోభ, డిసిహెచ్ఎస్ డా. పాల్ సతీష్, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, ప్రభృతులు పాల్గొన్నారు.


