NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదలకు అండగా నిలవడమే నిజమైన ఉన్నత స్థితి

1 min read

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి

హోసన్నా మందిర్ సువార్త స్వస్తత సభలు,పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే

కులమతాలకు,రాజకీయాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటా

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భౌతికమైన ఆస్తులు, అంతస్తులు,ఐశ్వర్యం కంటే నిరుపేద ప్రజలకు సేవ చేస్తూ వారి గుండెల్లో స్థానం సంపాదించుకోవడమే తన జీవితంలో అత్యంత ఉన్నతమైన స్థితి అని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో హోసన్నా మందిర్ ఆధ్వర్యంలో మే 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన సువార్త స్వస్తత సభల ముగింపు రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సభల నిర్వాహకులు పాస్టర్ ఈ.డి. కృపానందం, పాస్టర్ పరిశుద్ధ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి పుష్పగుచ్ఛాలు అందజేసిఘనంగా స్వాగతం పలికారు. నిరంతరం నిరుపేద ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ కొండంత అండగా నిలుస్తున్న చింతమనేని ప్రభాకర్ కి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు, ఐశ్వర్యవంతమైన దైవకృప కలగాలని ఆకాంక్షిస్తూ దైవజనులు వేదికపై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు అందజేశారు.అనంతరం వేదికపై నుంచి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన ప్రసంగం సభకు విచ్చేసిన అనేక మంది విశ్వాసుల హృదయాలను కదిలించింది. ఆయన మాట్లాడుతూ “తనకు జీవితంలో పెద్ద పెద్ద బంగళాలు, కోట్లాది రూపాయల ఆస్తులు, ఐశ్వర్యాలు,విలాసవంతమైన జీవితం ఉంటే తాను ఉన్నత స్థితిలో ఉన్నట్లు ఏనాడూ భావించనని, అవన్నీ తను చూడనివి కావని అన్నారు. ఏనాడైతే పేద ప్రజల కన్నీళ్లు తుడిచే అవకాశం, వారికి కొండంత అండగా నిలిచే భాగ్యం తనకు దక్కిందో దాన్నే తాను జీవితంలో అత్యున్నత స్థితిగా భావిస్తూ ప్రజల కోసం సేవలు అందిస్తూ జీవిస్తున్నాను అని అన్నారు. కుల,మత,రాజకీయ పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి తాను ఎల్లవేళలా అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సువార్త స్వస్థత సభలలో పాల్గొన్న దైవజనులకు, నిర్వాహకులకు,విశ్వాసులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్తులు,ఐశ్వర్యాల కంటే పేదలకు సేవ చేయడమే ఉన్నతమైన స్థితి అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చెప్పిన మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని సామెతల గ్రంథము 22వ అధ్యాయము,1వ వచనంలోని దైవవాక్యానికి అద్దం పడుతున్నాయి.అపరిమితమైన ఐశ్వర్యముకంటె మంచి పేరును, వెండిబంగారములకంటె దయయు కోరదగినవి (సామెతలు 22:1)ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సైతం భౌతిక సంపద కంటే ప్రజల పట్ల చూపించే దయ,కరుణ, వారి నుంచి పొందే మంచి పేరే మిన్న అని చాటిచెప్పడం ద్వారా దైవ వాక్యాన్ని ఆచరణలో చూపిస్తున్నారని విశ్వాసులు కొనియాడారు.ఈ మహాసభలలో  పలు గ్రామాల నుండి క్రైస్తవ సోదర సోదరీమణులు,విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *