హొళగుందలో రెండు సీజనల్ హాస్టల్స్ ప్రారంభం
1 min read
వలస విద్యార్థులకు సీజనల్ హాస్టల్స్ వరం లాంటివి
చదువుకు ఆటంకం లేకుండా విద్యార్థులు హాస్టళ్లను సద్వినియోగం చేసుకోవాలి
హొళగుంద న్యూస్ నేడు:వలస వెళ్లే విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా, వారి విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సీజనల్ హాస్టల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మండల విద్యాధికారి పి. కబీర్ సాబ్, ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీనివాసులు, తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహేట శేషగిరి, ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సిహెచ్. నాగరాజు అన్నారు.మంగళవారం మండల కేంద్రమైన హొళగుందలో జిల్లా సమగ్ర శిక్ష సౌజన్యంతో, ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ, అంబేద్కర్ స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో వలస విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన రెండు సీజనల్ హాస్టల్స్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన వసతులను పరిశీలించి, హాస్టల్ నిర్వహణకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయ పనులు, ఇతర ఉపాధి అవకాశాల కోసం తల్లిదండ్రులు వలస వెళ్లే సమయంలో విద్యార్థులు కూడా వారితో పాటు వెళ్లడం వల్ల పాఠశాలలకు దూరమై చదువుకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అలాంటి విద్యార్థులకు సీజనల్ హాస్టల్స్ ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.సీజనల్ హాస్టల్స్‌లో విద్యార్థులకు వసతి కల్పించడం ద్వారా వారు నిరంతరం పాఠశాలకు హాజరవుతూ చదువును కొనసాగించే అవకాశం లభిస్తుందన్నారు. దీంతో విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు, మధ్యలో చదువు మానేసే పరిస్థితులను కూడా నివారించవచ్చని పేర్కొన్నారు.వలస వెళ్లే తల్లిదండ్రులు తమ పిల్లలను సీజనల్ హాస్టల్స్‌లో చేర్పించి, వారి విద్యాభ్యాసానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాలల్లో వారి హాజరు పెంపు, చదువు కొనసాగింపు లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం సీజనల్ హాస్టల్స్ నిర్వహణకు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. వలస కుటుంబాల పిల్లలకు విద్యను అందుబాటులో ఉంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో కీలకమని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ హెచ్. చలపతి, చిన్నహేట ప్రధానోపాధ్యాయులు ఏకే. మారెప్ప, పాండురంగరాజు, హొళగుంద ఎంపీపీ ఎస్‌డబ్ల్యూఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నప్పరెడ్డి, సీఆర్పీలు లక్ష్మప్ప, తుకారాం, రేణుక, సీజనల్ హాస్టల్ సిబ్బంది జమాదగ్ని, సోహెబ్, విజయలక్ష్మి, ఎంఈఓ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్లు సాయి బేస్, పంపాపతి, గ్రామస్తులు తోటప్ప, హనుమంతు, మల్లికార్జున, విద్యార్థులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.


