కూటమి పాలనలో ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చారు
1 min read
రౌడీయిజంతో సాధించే విజయాలు ప్రజాభిమానం పొందలేవు
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు! ఎన్నికల స్వేచ్ఛకు అడ్డంకులు
స్వేచ్ఛాయుత ఎన్నికలతోనే తమబలం నిరూపించుకోవాలి
రాయచోటిలో సుప్రీంకోర్ట్ ఆదేశాలకూ విలువ లేదా?
రౌడీయిజం,గూండాయిజంతో రాయచోటి ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు
ప్రశ్నిస్తే కేసులా.. పోటీ చేస్తే బెదిరింపులా?
ప్రజల మధ్యకు రండి.. ప్రజల తీర్పును స్వీకరించండి!
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్ ను కడప సెంట్రల్ జైలులో పరామర్శించా
జిన్నా షరీఫ్ కుటుంభాన్ని చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది..
ప్రజాస్వామ్యపరిరక్షణకు నిరంతరం పోరాడతా
వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
అన్నమయ్య జిల్లా న్యూస్ నేడు: ( సి వెంకట్రామరాజు న్యూస్ నేడు బ్యూరో)ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన పాలకులే దానిని నడిరోడ్డుపై నిలబెట్టి అపహాస్యం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం రాయచోటి పట్టణం ఎస్ ఎన్ కాలనీలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల్లో ప్రత్యర్థులు స్వేచ్ఛగా పోటీ చేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు వేయకుండా బెదిరించడం, కార్యాలయాలపై దాడులు చేయడం, కార్యకర్తలపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. అధికార బలంతో, రౌడీయిజంతో సాధించే విజయాలు ప్రజాభిమానం కావని, నిజమైన బలం ప్రజల స్వేచ్ఛాయుత తీర్పుతోనే నిరూపించుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనుకునేవారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా రాయచోటిలో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై గౌరవం తగ్గిపోతున్నదని, రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఉండాల్సిన కనీస హుందాతనం, పరస్పర గౌరవం కనుమరుగవుతున్నాయని అన్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన రాజకీయాలు బెదిరింపులు, దాడులు, కక్షసాధింపుల చుట్టూ తిరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
జనసేన, బీజేపీ మద్దతు లేకుంటే పరిస్థితి వేరుగా ఉండేది
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావించిన శ్రీకాంత్ రెడ్డి, కూటమి విజయాన్ని కేవలం టీడీపీ బలంగా చిత్రీకరించడం సరికాదన్నారు. జనసేన, బీజేపీ మద్దతు, ఆయా పార్టీల ఓట్ల బదిలీ కూడా ఫలితాలపై ప్రభావం చూపాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కారణంగా తనకు రావాల్సిన ఓట్లలో సుమారు ఆరు వేల ఓట్ల మేర ప్రభావం పడిందని, జనసేనకు నియోజకవర్గం లో సుమారు 30 వేల ఓట్ల స్థాయి బలం ఉందని, బీజేపీకి ఏడు నుంచి ఎనిమిది వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని తన అంచనాలను వివరించారు. ఈ పార్టీల మద్దతుతోనే కూటమి విజయం సాధించిందని, ఆ మద్దతును విస్మరించి వ్యక్తిగత బలంగా ప్రచారం చేసుకోవడం సరికాదని విమర్శించారు.భవిష్యత్తులో ఆయా పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో కూటమి నేతలకే తెలుసని వ్యాఖ్యానించారు. మీరు స్వల్ప మెజారిటీతోనే గెలుపొందారని ఆయన గుర్తుచేశారు.ఎంపీటీసీ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయని, సుప్రీంకోర్టు దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లినప్పటికీ మళ్లీ అలాంటి ఘటనలే చోటుచేసుకోవడం ఆందోళనకరమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల వ్యవస్థలో అభ్యర్థులకు భద్రత లేకపోవడం, మహిళలు సైతం భయపడాల్సిన పరిస్థితులు రావడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని అన్నారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నంత మాత్రాన కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం అమానుషమని అన్నారు. అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎంతో చేశామని చెబుతున్నప్పుడు, ప్రజల తీర్పును ఎదుర్కొనేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. నిజంగా ప్రజల మద్దతు ఉందని నమ్మితే అభ్యర్థులందరికీ స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం కల్పించి, ప్రజల ఓట్లతో గెలిచి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టి పోటీ నుంచి తప్పించడం వల్ల ప్రజల విశ్వాసం లభించదని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉందని పేర్కొన్నారు.


