రెండేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించాం.. మంత్రి టీజీ భరత్ గుప్తా
1 min read
రెండేళ్ల పాలనపై ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నాం
కర్నూల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్
కర్నూలు ,న్యూస్ నేడు: రెండేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా చెప్పారు. కర్నూలు నగరంలోని 3వ వార్డు సాగు మండి వద్ద నుండి ఇంటింటికీ వెళ్లి ఆయన ప్రజలను కలిశారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తామంతా ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం రెండు సంవత్సరాల కాలంలో అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ, విదేశాలు తిరిగి రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నట్లు వివరించారు. కర్నూలుకు సైతం ఇప్పటికే రూ.10వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. త్వరలో రిలయన్స్ కంపెనీ ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటికే ఉన్న జైరాజ్ స్టీల్ కంపెనీ మరో రూ.6వేల కోట్లతో కంపెనీని విస్తరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. నగరంలోని వార్డుల్లో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కర్నూలులో ఎన్నడూ లేని అభివృద్ధి గత రెండేళ్లలో చేశామన్నారు. సమస్య ఉందని తెలిసిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప జరిగిందేమీ లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మాటిచ్చిన విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. తల్లికివందనం పథకం ద్వారా ఎంత మంది పిల్లలున్నా అందరికీ డబ్బులు పడుతున్నాయన్నారు. వైసీపీ నేతల అబద్ధపు ప్రచారం నమ్మొద్దని ప్రజలను మంత్రి కోరారు. మంచి చేసే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఎప్పటికీ ఉండాలన్నారు.ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. వైసీపీ నాయకులకు దాడులు, అరాచకాలు తప్ప ప్రజా సమస్యలు పట్టవన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రజల సమస్యల గురించి మాట్లాడలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే పరిస్థితి ఉండదని, వైసీపీలో ఉన్న కొందరు మంచి నాయకులు వేరే దారి చూసుకుంటే బాగుంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, బూత్ ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.



