గోదావరి పుష్కరాలను మరింత ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా నిర్వహిస్తాం
1 min read
రాష్ట్రంలోని జీర్ణోద్ధరణ దశలో ఉన్న 6200 దేవాలయాలలో ధూప ,దీప, నైవేద్యాలు కోసం అర్చకులకు ఏటా రూ.74. 74 కోట్లు
రాష్ట్రంలోని 27 వేల ఆలయాలకు పూర్వవైభవం తీసుకువస్తాం
సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం రాష్ట్రంలో ఆలయాలు లేని కుగ్రామాలు, కాలనీలలో 5 వేల భజన మందిరాలు నిర్మిస్తాం
ద్వారకాతిరుమలలో పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గోదావరి పుష్కరాలను మరింత ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా నిర్వహిస్తామని, ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ద్వారకాతిరుమల దేవాలయంలో 29 కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన పలు పనులను మంత్రి శనివారం ప్రారంభించిన అనంతరం ఆకాశరాజు అతిధి గృహంలో పాత్రికేయులతో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 2027 జూన్, 26 నుండి జులై, 7వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, పుష్కరాలకు 12 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా అని మంత్రి చెప్పారు. భక్తుల సంఖ్యకు తగిన రీతిలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సమీక్షిస్తారన్నారు. పుష్కరాలలో భక్తులకు స్నాన ఘట్టాలు, పిండ తర్పణాలు ఘాట్లు, ఆయా ప్రాంతంలో దేవాలయాల అభివృద్ధి, తదితర పనులపై ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలలోని 43 ఆలయాలను 54. 71 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి ఎన్నికలలో ఇచ్చిన 11 హామీలను నెరవేర్చామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న సనాతన ధర్మ పరిరక్షణ చర్యలతో రాష్ట్రంలోని దేవాలయాలలో 35 శాతం మందికి పైగా భక్తులు పెరిగారన్నారు. రాష్ట్రంలోని జీర్ణోద్ధరణ దశలో ఉన్న 6200 దేవాలయాలలో ధూప ,దీప, నైవేద్యాలు కోసం అర్చకులకు ఏటా రూ.74. 74 కోట్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 27 వేల ఆలయాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని , ఇంతవరకు 691 దేవాలయాల అభివృద్ధికి 812. 67 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామన్నారు. నేటి యువత వేదం అభ్యసించేందుకు ముందుకు రావడంలేదని, వేదపండితులు కూడా తమ పిల్లలకు వేదం నేర్పించేందుకు సుముఖత చూపడంలేదన్నారు. రాష్ట్రంలో వేదపండితులు తగ్గకూడదన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేదం చెదివే విద్యార్థులకు వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేవరకు 3 సంవత్సరాలపాటు నెలకు 3 వేల రూపాయలు భృతి కింద ఇస్తున్నామన్నారు. దేవాదాయ చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. ద్వారకాతిరుమల,ఐ.ఎస్. జగన్నాధపురం,పోలవరం ప్రాజెక్ట్ వరకు గల ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు దర్శించేందుకు ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు ఆలోచనలో ఉందన్నారు.ఐ.ఎస్. జగన్నాధపురం లో శ్రీ లక్ష్మి నరసింహస్వామి కొండపైకి రోడ్డు నిర్మాణాణం, ఆలయ అభివృద్ధిని 3.75 కోట్ల రూపాయలతో చేపట్టామన్నారు.రాష్ట్రంలోని దేవాలయాల గిరి ప్రదిక్షణాలకు రోడ్డు మార్గాలు నిర్మిస్తున్నామన్నారు.రామతీర్థం గిరి ప్రదిక్షణకు రోడ్డు నిర్మించామని, అదేవిధంగా శ్రీకాళహస్తిలో 20 కోట్లతో గిరిప్రదిక్షణ మార్గానికి అవసరమైన రోడ్డును నిర్మిస్తున్నామన్నారు.గత ప్రభుత్వం 9. 5 లక్షల కోట్ల రూపాయల అప్పులను కూటమి ప్రభుత్వానికి అందించిందని,దీనికి ఏటా 1.40 లక్షల కోట్ల రూపాయలు వడ్డీలుగా చెల్లిస్తున్నామన్నారు. ఇంతటి ఆర్ధిక ఇబ్బందులు, నిధులు కొరత ఉన్నప్పటికీ దైవ సేవకు ఎటువంటి నిధులు కొరత లేకుండా దేవాలయాలకు సంబంధించి ఇచ్చిన 11 హామీలను నెరవేర్చమన్నారు. రాష్ట్రంలోని 967 ఆలయాల పాలకవర్గాలను ఏర్పాటుచేయవలసి ఉందని, ఇంతవరకు 452 దేవాలయాలకు పాలకవర్గాల ఏర్పాటు వివిధ దశలలో ఉన్నాయన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, వంశ పారంపర్య ధర్మకర్త మండలి చైర్మన్ రాజా సూరానేని వెంకట సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త సూరానేని నివృతిరావు, ప్రభృతులు ఉన్నారు.


