యూరియా పంపిణీ పరిశీలించిన ఏవో..
1 min read

మహానంది, న్యూస్ నేడు: మహానంది మండలంలోని తిమ్మాపురం సహకార సొసైటీ ద్వారా రైతులకు యూరియా పంపిణీని మండల వ్యవసాయ శాఖ అధికారి (ఏవో) నాగేశ్వర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. సొసైటీ గోదాంలో ఉన్న యూరియా నిల్వలను తనిఖీ చేశారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ రైతుల అవసరాల నిమిత్తం వారికి కావాల్సిన రసాయనిక ఎరువులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో అందజేస్తామని రైతులకు తెలియజేశారు. మార్క్ఫెడ్ లో యూరియా మరియు ఇతర రసాయనిక ఎరువులు నిల్వలు ఉన్నాయని రైతులు భయపడవద్దని, అపోహలు వీడాలని సూచించారు. ఏ ప్రాంతానికి ఎంత మోతాదులో రసాయనిక ఎరువుల అవసరమో దానిని బట్టి రైతులకు అన్ని సహకార సంఘాల , రైతు సేవ కేంద్రాల ద్వారా అందజేస్తామని భరోసా ఇచ్చారు. రైతు సేవ కేంద్రాల్లో పని చేసే వ్యవసాయ శాఖ సిబ్బంది బదిలీల్లో ఉన్నందున కొన్ని సమస్యలు తలెత్తయని అందువల్లనే రైతు సేవ కేంద్రాల ద్వారా రసాయనిక ఎరువుల పంపిణీ జాప్యం జరుగుతుందని రైతులకు తెలియజేశారు. ప్రైవేటు డీలర్లు కొన్ని రకాల పిలకలు కట్టే గుళికలను మరియు కొన్ని రకాల మందులను రైతులకు అంటగడుతున్నారని రైతుల పేర్కొనడంతో అనధికారిక మందులను, గుళికలను అంటగట్టడంతోపాటు యూరియా మరియు డి ఏ పి ఇతర రసాయనిక ఎరువులు రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సందర్భంలో రైతులు అపోహలతో బఫర్ స్టాక్( అదనపు నిల్వలు ) ఉంచుకోవద్దని కోరారు. రైతులు తమ పంట పొలాల్లో అవసరమైన మేరకే రసాయనికి ఎరువులు వినియోగించుకోవాలని వాటి పరిధి దాటి వినియోగిస్తే భూసారం తగ్గిపోవడంతో పాటు వాతావరణ కాలుష్యం, పర్యావరణ సమతుల్యం దెబ్బతినే అవకాశం ఉందని ఏవో నాగేశ్వర్ రెడ్డి రైతులకు సూచించారు. ఇక్కడ పరిష్కారం కానీ రైతుల సమస్యలను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. యూరియా పంపిణీలో తిమ్మాపురం సహకార సంఘ సొసైటీ సీఈవో వెంకటస్వామి, సహకార సంఘ సిబ్బంది పాల్గొన్నారు.


